-
హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. తెలంగాణలో టిడిపి ఓటు బ్యాంకును పదిలం చేసుకునేందుకు ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి క్యాడర్ కోసం ఆయన వ్యూహాత్మకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు విగ్రహ ఏర్పాటులో నిమగ్నమయ్యారు.
అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో…
హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం అమీర్ పేట చౌరస్తా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి పనులు మొదలయ్యాయి. ప్రధానంగా సెటిలర్స్ తో పాటు టిడిపి సానుభూతిపరులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది. వారిని టార్గెట్ చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అర్థం అవుతుంది. ఒక్క అమీర్ పేట లోనే కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాట్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్ట్ పార్ట్ అందిస్తున్నారు.
టిడిపి క్యాడర్ చేజారకుండా…
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లేకపోవచ్చు కానీ.. క్యాడర్ ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ టిడిపి బలం చెక్కుచెదరలేదు. గత ఎన్నికల్లో రేవంత్ ను తమ వాడిగా భావించింది టిడిపి క్యాడర్. కెసిఆర్ చర్యలతో టిడిపి పూర్తిగా డీలా పడింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రూపంలో వారికి కేసీఆర్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశం దక్కింది. అలా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసింది టిడిపి క్యాడర్. అయితే ఈసారి టిడిపి ఓట్లను దక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి తెలంగాణలో. జూబ్లీహిల్స్ బై పోల్ సమయంలో పెద్ద డిబేట్ కూడా జరిగింది దీనిపై. అయితే టిడిపి ఓటు బ్యాంకు తన నుంచి చేజారకుండా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే అమీర్ పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం పనులు ప్రారంభించారని.. ఇది పూర్తయిన వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ప్రతిపాదించిన వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రేవంత్ సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.