క్రైమ్ మిర్రర్, జాతీయం :- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించినట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్న అమిత్ షా, బండి భగీరథ్ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక కోరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, చట్టవ్యవస్థ పరిస్థితులు, ముఖ్య రాజకీయ సంఘటనలపై నివేదిక సమర్పించినట్లు సమాచారం. అదే సమయంలో బండి భగీరథ్ కేసు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్లు తమ రాష్ట్రాలకు సంబంధించిన కీలక పరిణామాలపై తరచూ కేంద్ర హోంశాఖకు నివేదికలు అందించడం సాధారణమే అయినప్పటికీ, ఈ కేసు ప్రత్యేకంగా ప్రస్తావనకు రావడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, బండి భగీరథ్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఆయనపై నమోదైన పోక్సో కేసులో విచారణ కొనసాగుతోంది. అరెస్టు ముందు హైడ్రామా చోటుచేసుకోగా, హైకోర్టులో ముందస్తు బెయిల్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అనంతరం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే బండి సంజయ్ స్పందిస్తూ, “చట్టం ముందు అందరూ సమానమే” అని పేర్కొన్నారు. తన కుమారుడు నిర్దోషి అని చెబుతున్నప్పటికీ, విచారణకు సహకరించేందుకే పోలీసులకు అప్పగించామని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం తమదైన రీతిలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు.ఇక అమిత్ షా స్థాయిలో ఈ కేసుపై సమాచారం సేకరణ జరగడం వెనుక రాజకీయ కోణం ఉందా? లేక కేవలం రాష్ట్ర పరిస్థితుల సమీక్షలో భాగమా? అనే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న సమయంలో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.