HomeజాతీయంKerala CM: నేడే కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణం.. 20 మందికి మంత్రివర్గంలో చోటు!

Kerala CM: నేడే కేరళ సీఎంగా వీడీ సతీశన్‌ ప్రమాణం.. 20 మందికి మంత్రివర్గంలో చోటు!

కేరళలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆయన తన మంత్రివర్గ సభ్యుల జాబితాను ఇప్పటికే ప్రకటించారు. భాగస్వామ్య పార్టీలతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాతే ఈ జాబితాను ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.

మంత్రివర్గంలో 20 మందికి చోటు

మొత్తం 20 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పడనుంది. ఇందులో 14 మంది తొలిసారిగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతుండటం ప్రత్యేకంగా నిలిచింది. అలాగే, ఇద్దరు మహిళలకు, ఇద్దరు ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. సామాజిక అంశాలు, ప్రాంతీయ సమీకరణాలు, మిత్రపక్షాల ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని మంత్రులను ఎంపిక చేసినట్లు సతీశన్‌ వివరించారు.

సీనియర్లకు పెద్దపీట

కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలు రమేశ్‌ చెన్నితాల, కే మురళీధరన్‌, కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌లకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే తిరువంచూర్ రాధాకృష్ణన్‌ను స్పీకర్‌గా, షనిమోల్ ఉస్మాన్‌ను డిప్యూటీ స్పీకర్‌గా నియమించాలని యూడీఎఫ్ నిర్ణయించింది.

మిత్రపక్షాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. ఐయూఎంఎల్‌ సీనియర్ నేత పీకే కున్హలికుట్టి, ఆర్‌ఎస్‌పీ నేత శిబు బేబీ జాన్‌, కేరళ కాంగ్రెస్‌ నాయకుడు మోన్స్ జోసెఫ్‌, కేరళ కాంగ్రెస్‌ (జాకోబ్‌)కు చెందిన అనూప్ జాకోబ్‌లకు మరోసారి మంత్రి పదవులు దక్కాయి. యూడీఎఫ్‌లో కీలక భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌కు మొత్తం ఐదు మంత్రి పదవులు కేటాయించడం విశేషం.అయితే కాంగ్రెస్‌ పార్టీ 63 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో, మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురుచూసిన పలువురు నేతలకు చోటు కల్పించడం సాధ్యపడలేదని సతీశన్‌ తెలిపారు.

తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం

తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో వీడీ సతీశన్‌తో పాటు 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు