Homeఅంతర్జాతీయంDonald Trump: తైవాన్ కోసం చైనాతో పోరాడం కష్టం.. బీజింగ్ పర్యటన తర్వాత ట్రంప్ యూటర్న్!

Donald Trump: తైవాన్ కోసం చైనాతో పోరాడం కష్టం.. బీజింగ్ పర్యటన తర్వాత ట్రంప్ యూటర్న్!

తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు తైవాన్‌కు మద్దతుగా మాట్లాడిన ట్రంప్, ఇప్పుడు కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నారు. చైనా పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

తైవాన్  కోసం చైనాతో యుద్ధం చేయలేం!

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయాలనే ఆలోచన తమకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. తైవాన్ చైనాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అమెరికా మాత్రం దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరంలో ఉందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో ఏదైనా ఉద్రిక్తత ఏర్పడితే వెంటనే స్పందించడం అమెరికాకు అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా చాలా పెద్దది, శక్తివంతమైన దేశమన్నారు. తైవాన్ అంశంలో రెండు దేశాలు కూడా సంయమనం పాటించాలని సూచించారు. సమస్యలు మరింత పెరగకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

ఇదే సమయంలో తైవాన్‌కు అమెరికా అందించాల్సిన 14 బిలియన్ డాలర్ల ఆయుధాల ప్యాకేజీపై కూడా ట్రంప్ స్పందించారు. ఆ ప్యాకేజీకి సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీంతో అమెరికా భవిష్యత్తులో తైవాన్‌కు ఎంతవరకు మద్దతు ఇస్తుందన్న అంశంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తైవాన్ ను విలీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నం

తైవాన్‌ను పూర్తిగా తమలో విలీనం చేసుకోవాలని చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే, అమెరికా ఇప్పటి వరకు తైవాన్‌ కు మద్దతుగా నిలుస్తూ చైనా చర్యలను విమర్శిస్తూ వచ్చింది. ట్రంప్ కూడా గతంలో బీజింగ్ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ తాజా పర్యటన తర్వాత ఆయన మాటల్లో మార్పు కనిపించడంతో అంతర్జాతీయ వర్గాలు దీనిపై ఆసక్తిగా గమనిస్తున్నాయి.  అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అంశం అత్యంత కీలకమని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తనతో ప్రత్యేకంగా చర్చించారని ట్రంప్ తెలిపారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు