తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. నేటి కాలంలో పాన్ ఇండియా సినిమాలు భారీ స్థాయిలో రూపొందుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ, దాదాపు 7 దశాబ్దాల క్రితమే తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది. అలాంటి అపూర్వమైన చిత్రాల్లో 1951లో విడుదలైన “మల్లీశ్వరి” ఒకటి. మహానటుడు నందమూరి తారక రామారావు, ప్రముఖ నటి భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు బి.ఎన్.రెడ్డి అత్యంత వైభవంగా తెరకెక్కించారు. వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం అప్పటి తెలుగు సినిమా ధోరణినే మార్చేసిందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్, భానుమతిల నటన, వారి మధ్య భావోద్వేగ అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ఈ సినిమా కథ శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం నేపథ్యంలో సాగుతుంది. హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో వీరాపురం అనే గ్రామంలో కథ ప్రారంభమవుతుంది. వస్త్రాల నేయడం, శిల్ప కళలు, సంగీతం, నృత్యం వంటి కళల్లో నైపుణ్యం కలిగిన ప్రజలు నివసించే ఆ గ్రామంలో నాగరాజు పాత్రలో ఎన్టీఆర్, మల్లీశ్వరి పాత్రలో భానుమతి చిన్ననాటి నుంచే అన్యోన్యంగా పెరుగుతారు. వారి ప్రేమను మల్లీశ్వరి తల్లి వ్యతిరేకించడంతో ఆమెను రాణివాసానికి పంపిస్తుంది. ప్రేమను కోల్పోయిన బాధతో నాగరాజు సంపాదన కోసం గ్రామం విడిచి వెళ్లి శిల్ప కళలో అపూర్వ ప్రతిభను కనబరుస్తాడు. తరువాత శ్రీకృష్ణదేవరాయల వసంత మండప నిర్మాణానికి ప్రధాన శిల్పిగా ఎంపికవుతాడు. అక్కడ అతను చెక్కిన శిల్పాల్లో మల్లీశ్వరి రూపాన్ని గుర్తించిన ఆమె రహస్యంగా నాగరాజును కలుస్తుంది. చివరికి రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో వారి ప్రేమకు అంగీకారం లభించడం కథలో ప్రధాన మలుపుగా నిలుస్తుంది.
ఈ చిత్రానికి కథ ఎంత బలంగా ఉందో, సంగీతం కూడా అంతే అద్భుతంగా నిలిచింది. సినిమాలోని మొత్తం 17 పాటల్లో 16 పాటలను ప్రముఖ కవి దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రచించారు. సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు అందించిన స్వరాలు చిత్రానికి మరింత ప్రాణం పోశాయి. “నెల రాజా వెన్నెల రాజా”, “మనసున మల్లెల మాలలుగానే”, “అవునా నిజమేనా” వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. పాటల సాహిత్యం, స్వరాలు, చిత్రీకరణ అన్నీ కలసి ఈ సినిమాను ఒక సంగీత కావ్యంగా నిలబెట్టాయి.
మల్లీశ్వరి చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. విడుదలైన సమయంలో 13 కేంద్రాల్లో 71 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితమైంది. అంతేకాకుండా చైనాలో ఉపశీర్షికలతో విడుదలై 100 రోజులు ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రాల్లో మల్లీశ్వరి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని సినీ అభిమానులు భావిస్తుంటారు.
ALSO READ: Money Astrology: ఈ ఒక్క పరిహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది!