Homeఆంధ్ర ప్రదేశ్ప్రశాంత్ కిషోర్ కోసం ఆరాటం!

ప్రశాంత్ కిషోర్ కోసం ఆరాటం!

•భారీగా ఆఫర్ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
•తిరస్కరిస్తున్న ఒక్కప్పటి వ్యూహకర్త
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:- ప్రశాంత్ కిషోర్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రయత్నిస్తోందా? మరోసారి ఆయనను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవాలని చూస్తోందా? ఇందుకు భారీగా ఆఫర్ చేస్తోందా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీతోపాటు జగన్మోహన్ రెడ్డికి పనిచేయని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ వార్త హల్చల్ చేస్తోంది.

దేశంలోని దిగ్గజ పార్టీలకు, దిగ్గజనేతలకు తన రాజకీయ వ్యూహాలను అందించారు ప్రశాంత్ కిషోర్. 2014లో నరేంద్ర మోడీకి రాజకీయ వ్యూహ కర్తగా సక్సెస్ కావడంతో ప్రశాంత్ కిషోర్ పేరు మార్మోగిపోయింది.. అటు తర్వాత మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి లాంటి వారికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. అయితే వ్యూహకర్తగా ఆయన ఖాతాలో సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కు రాజకీయ సలహాలు అందించి ఆయన గెలుపులో భాగం పంచుకున్నారు ప్రశాంత్ కిషోర్. దీంతో మరోసారి ప్రశాంత్ కిషోర్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడినట్లు ప్రచారం నడుస్తోంది.

వ్యూహకర్తగా విజయం
2014 నుంచి 2019 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్షపాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏలో అప్పట్లో కీలక భాగస్వామి కూడా. ఆ సమయంలో అధికార పక్షాన్ని ఢీ కొట్టాలి అంటే కచ్చితంగా రాజకీయ వ్యూహాలు ఉండాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అప్పటికే మంచి సక్సెస్ ల మీద ఉన్న ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించారు. అలా 2017లో వైసీపీకి వ్యూహకర్తగా నియమితులయ్యారు ప్రశాంత్ కిషోర్. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రశాంత్ కిషోర్ తన ఐ ప్యాక్ తో రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయం అందించారు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు ప్రశాంత్ కిషోర్. ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అసహనం వ్యక్తం చేసిన ఆయన 2024 ఎన్నికల ముంగిట కీలక ప్రకటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం చవిచూస్తారని తేల్చి చెప్పారు. నేరుగా అమరావతికి వచ్చి చంద్రబాబును కలిసి కూటమికి సానుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన మాదిరిగానే జగన్మోహన్ రెడ్డికి దారుణ ఓటమి ఎదురైంది. కూటమి అధికారంలోకి రాగలిగింది.

పీకే వైపు మొగ్గు
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే బలమైన వ్యూహకర్త అవసరం. అందుకే తనకు పూర్వాశ్రమంలో సేవలు అందించిన ప్రశాంత్ కిషోర్ వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డికి సేవలు అందించేది లేదని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో జన్ సూరజ్ పార్టీని ఏర్పాటు చేశారు. బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. కానీ పార్టీని అలానే కొనసాగిస్తానని.. అవసరం అనుకుంటే సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీని నడుపుతానని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం మెత్తబడలేదని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు