HomeజాతీయంRangasamy: గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. మే 13న పుదుచ్చేరి సీఎంగా ప్రమాణస్వీకారం!

Rangasamy: గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. మే 13న పుదుచ్చేరి సీఎంగా ప్రమాణస్వీకారం!

Rangasamy Meets LG: పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్. రంగస్వామి ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం  ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ కె. కైలాసనాథన్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను కూడా అందజేశారు. రంగస్వామితో పాటు ఎన్డీయే కూటమికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

మే 13న సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం

అటు రంగస్వామి ఇచ్చిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. మే 13న రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఐదోసారి కావడం విశేషం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలుచుకుంది. అలాగే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన అన్నాడీఎంకే, ఎల్‌జేకే ఒక్కో స్థానంలో గెలిచాయి. దీంతో మొత్తం 30 సభ్యుల అసెంబ్లీలో ఎన్డీయే బలం 18కు చేరింది. అసెంబ్లీలో ముగ్గురు నామినేటెడ్ సభ్యులు కూడా ఉండటంతో కూటమి మరింత బలపడే అవకాశముంది. ఇక ప్రతిపక్ష డీఎంకే 5 స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ ఒక సీటుతో సరిపెట్టుకుంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 2 స్థానాల్లో విజయం సాధించింది.

ఎన్నికల ఫలితాల తర్వాత రంగస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. పుదుచ్చేరిలో వరుసగా మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం అక్కడి రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇక రంగస్వామి కొత్త మంత్రివర్గం ఎలా ఉండబోతుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు