మనుషుల స్వభావాలు ఒక్కోరికొకలా ఉంటాయి. ముఖ్యంగా వైవాహిక బంధాల్లో ప్రేమ, గౌరవం, గుర్తింపు కోసం మహిళలు ఎక్కువగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. అయితే ఇదే భావోద్వేగాలను కొందరు పురుషులు తమ ఆధిపత్యానికి ఆయుధంగా మార్చుకుంటున్నారు. భాగస్వామిని మానసికంగా బలహీనపరిచి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ ప్రమాదకర ప్రవర్తనను ‘గ్యాస్‌లైటింగ్’గా పిలుస్తున్నారు. బయటకు సాధారణంగా కనిపించే ఈ మానసిక వేధింపులు క్రమంగా వ్యక్తి జీవితాన్నే చీకటిలోకి నెట్టేస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్‌లైటింగ్ అనేది ఒక రకమైన మానసిక మోసం. ఇందులో ఒక వ్యక్తి తన భాగస్వామి ఆలోచనలు, జ్ఞాపకాలు, భావోద్వేగాలను తప్పుగా చూపిస్తూ వారిలోనే అనుమానం కలిగిస్తారు. తాము చెప్పిందే నిజమని నమ్మిస్తూ, ఎదుటివారి భావాలను చిన్నచూపు చూడటం దీని ప్రధాన లక్షణం. ఇది శారీరక హింసలా బయటకు కనిపించకపోయినా, లోలోపల వ్యక్తిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుంది. పదేపదే అవమానించడం, ప్రతి విషయానికీ తప్పు పట్టడం, చేసిన పనిని తక్కువ చేసి మాట్లాడడం వంటి ప్రవర్తనలు గ్యాస్‌లైటింగ్‌లో భాగమని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వ్యక్తులు భాగస్వామి చేసే చిన్న చిన్న పనులకే అతిగా స్పందిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటారు. “నువ్వు ఏం చేసినా సరిపోదు”, “నీ వల్ల ఏమీ కాదు” వంటి మాటలతో మానసికంగా కుంగదీస్తారు. తాము చెప్పిందే వాస్తవమని నిరూపించడానికి ప్రయత్నిస్తూ, అందరి ముందు భాగస్వామిని తప్పుగా చూపించేందుకు వెనుకాడరు. కొన్నిసార్లు తామే చెప్పిన విషయాలను మర్చిపోయినట్లు నటిస్తూ, ఎదుటివారి మానసిక స్థితిపైనే వారికి అనుమానం కలిగేలా చేస్తారు. ఫలితంగా బాధితులు తాము నిజంగానే తప్పు చేస్తున్నామేమోనని భావించి తీవ్ర ఒత్తిడికి గురవుతారు.
గ్యాస్‌లైటింగ్‌కు పాల్పడే వారు బంధంలో తమదే పైచేయి కావాలని ప్రయత్నిస్తారని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామి తప్పు చేయకపోయినా పదేపదే క్షమాపణలు చెప్పించాలని ఒత్తిడి తెస్తారు. భావోద్వేగాలను ఉపయోగించుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడతారు. కొంతమంది భార్యను కేవలం ఇంటి పనులు, శారీరక అవసరాల కోసమే గుర్తించి, ఆమె భావాలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకవేళ భార్య తమ అసలు స్వభావాన్ని గుర్తిస్తే అకారణంగా గొడవలు సృష్టించి మానసికంగా మరింత వేధించే ప్రయత్నం చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్యాస్‌లైటింగ్ బారిన పడిన మహిళలు క్రమంగా తమ జీవితంపై నియంత్రణ కోల్పోతారు. ఏది నిజం, ఏది తప్పో అర్థంకాక మానసికంగా కృంగిపోతారు. ఊపిరాడని బంధంలో చిక్కుకున్న భావనతో జీవితం నెమ్మదిగా నరకంగా మారుతుంది. బయటకు చెప్పుకోలేక, లోలోపలే బాధను భరించాల్సి వస్తుంది. బంధంలో పదేపదే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే, ఎప్పుడూ తప్పు మీదేనని నిరూపించబడుతుంటే అలాంటి పరిస్థితిని సాధారణంగా తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి మానసిక వేధింపులను గుర్తించి, మానసిక దృఢత్వంతో ముందుకు రావడం చాలా ముఖ్యమని మానసిక వైద్యులు చెబుతున్నారు. అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మీ ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తుంటే, అది ప్రేమ కాదు మానసిక హింస అని గుర్తించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. సమయానికి అలాంటి బంధాల నుంచి బయటపడకపోతే మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు