చెన్నై, క్రైమ్ మిర్రర్ : తమిళనాడులో ఇప్పుడు సినీ నటి త్రిష హాట్ టాపిక్ గా మారారు. టీవీకే చీఫ్ విజయ్ కు దగ్గరగా ఉన్న త్రిష కూడా తమిళనాట రాజకీయ ప్రవేశం చేయనున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.అందులో భాగంగా విజయ్ రాజీనామా చేయనున్న తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి త్రిష పోటీ చేస్తారని, తర్వాత విజయ్ కేబినెట్ లో ఆమె కీలకమైన శాఖ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ విజయ్ విజయం తర్వాత త్రిష తమిళనాట ట్రెండింగ్ గా మారారు.
విజయ్ విక్టరీ వెనక త్రిష ఉన్నారని పెద్దయెత్తున విజయ్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.టీవీకే అంటేనే త్రిష.. విజయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. విజయ్ తాను పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్.. ఈ రెండు చోట్లా విజయం సాధించారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయాలని విజయ్ నిర్ణయించారు. ఆ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్థానంలో త్రిష పోటిచేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. గతంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ బరిలో ఉంటారని చెబుతున్నారు. విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్రిష విజయ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి.
త్రిషకు అంత ప్రాధాన్యత ఇచ్చి విజయ్ కష్టాలు కొని తెచ్చుకుంటారా? లేక త్రిష కు రాజకీయాల్లో స్థానాన్ని కల్పించేందుకు మొగ్గు చూపుతారా? అన్నది త్వరలోనే తేలనుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీవీకే నేతలు ఎవరూ పెదవి విప్పడం లేదు. విజయ్ కూడా ఈ ప్రచారాన్ని ఖండించకపోవడంతో త్రిష రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్రిష పొలిటికల్ ఎంట్రీని కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.