ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: అమెరికా సైనిక యుద్ధ విమానం కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ అదృశ్యంపై ఆందోళనలు రేపుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం ఖతార్ వద్ద పబ్లిక్ రాడార్ నుంచి అదృశ్యమైంది. విమానాలకు గాల్లో ఇంధనం నింపి వస్తుండగా కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ కనిపించకుండా పోయింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఈ విమానం అదృశ్యం ఆందోళనలకు దారి తీస్తోంది.
విమానాలకు ఇంధనం నింపి కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ తిరిగి సైనిక స్థావరం వైపు వెళ్తుండగా రాడాన్ నుంచి సిగ్నల్ కోల్పోయింది. సంబంధాలు తెగిపోవడానికి ముందు గ్లోబల్ సిగ్నల్ 7700 అనే అత్యవసర కోడ్‌ను కేసీ-135 పంపినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపిస్తోంది. సాంకేతిక సమస్యలు, అగ్నిప్రమాదం, వైద్య అత్యవసర పరిస్థితి, బయట నుంచి వచ్చే ముప్పు వంటి సందర్భాల్లో 7700 కోడ్‌ను విమానాలు పంపుతుంటాయి. అయితే, కేసీ-135 మిస్సింగ్ గురించి అమెరికా సైన్యం గానీ, ఇరాన్ అధికారులు గానీ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.