Homeక్రైమ్మిస్టరీగా మారిన చంద్రబోస్ సోదరుడి మృతి... అనుమానాస్పదంగా కేసు నమోదు...!

మిస్టరీగా మారిన చంద్రబోస్ సోదరుడి మృతి… అనుమానాస్పదంగా కేసు నమోదు…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: ముఖ సినీ గేయరచయిత చంద్రబోస్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేందర్ మృతి అనుమానాస్పదంగా మారడంతో ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొదట ఇది సహజ మరణంగా భావించినప్పటికీ, తర్వాత వచ్చిన పరిణామాలు కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చాయి.రాజేందర్ హైదరాబాద్‌లో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు.

ఇటీవల వ్యాపార పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలికిరి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఒక స్నేహితుడి వద్ద కొన్ని రోజులు గడిపినట్లు సమాచారం. ఘటన జరిగిన రోజున ఆయన అస్వస్థతకు గురై స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం దగ్గరలోని హోటల్‌లో అల్పాహారం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు గమనించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రారంభంలో కుటుంబ సభ్యులు పెద్దగా అనుమానం వ్యక్తం చేయకపోవడంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. అయితే హైదరాబాద్‌కు తీసుకెళ్లిన తర్వాత రాజేందర్ శరీరంపై గాయాల గుర్తులు కనిపించడం కుటుంబ సభ్యుల్లో అనుమానాలు కలిగించింది.

దీంతో ఆయన భార్య వసంత దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును కలికిరి పోలీసులకు బదిలీ చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.పోలీసులు ప్రస్తుతం రాజేందర్‌తో చివరిసారిగా ఉన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఆయన ప్రయాణ వివరాలు, ఫోన్ కాల్ రికార్డులు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు.ఈ ఘటనపై పూర్తి నిజాలు బయటపడాలంటే దర్యాప్తు పూర్తవాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు అనుమానాస్పద మృతిగా నమోదై ఉండటంతో, పోలీసుల విచారణపై అందరి దృష్టి పడింది. నిజంగా ఏమి జరిగిందో త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు