*తాలు ఉందంటూ బస్తాకు కిలో నుంచి రెండు కిలోల వరకు కటింగ్
* షార్టేజ్ పేరుతో అదనంగా లారీకి 5 నుంచి 10 క్వింటాళ్ల కోత
*ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతల అరిగోస
ఆరుగాలం కష్టపడ్డ రైతులకు ధాన్యం అమ్ముకునే సమయంలోనూ అవస్థలు తప్పడం లేదు. తాలు పేరుతో మిల్లర్లు నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు. పరిమితికి మించి తాలు ఉందంటూ బస్తాకు కేజీ నుంచి రెండు కేజీల వరకు కోతపెడుతున్నారు. ఏఈవోలు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూర్పార బట్టించినా కూడా, మిల్లు దగ్గరికి వెళ్లిన తర్వాత కోత పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల రోడ్ల మీద బైఠాయించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
క్రైమ్ మిర్రర్(నల్లగొండ బ్యూరో): అన్నదాతల పరిస్థితి రోజు రోజుకు అగమ్య గోచరంగా మారుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని చిరికి అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ఏదో ఒక సాకు చూపించి రైతులను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు మిల్లర్లు. గత సీజన్ లో తేమ పేరుతో కొర్రీలు పెట్టగా, ఈసారి తాలు పేరుతో ధాన్యంలో అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. ధాన్యం పండించేందుకు అరిగోస తప్పలేదు, ఇప్పుడు అమ్మకోవడంలో కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యంలో తాలు లేకపోయినా కోతలు పెడుతున్న మిల్లర్లు
ఈ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. రెండు రోజుల్లోనే ధాన్యం పూర్తిగా ఎండుతోంది. నిర్ణీత తేమశాతం 17 వరకు ఉండవచ్చని నిర్ణయించినా, నూటికి 90 శాతానికి పైగా రైతుల ధాన్యం 15 లోపే వస్తోంది. అయితే, ఈసారి కొత్తగా తాలు పేరుతో రైతులను ముంచే ప్రయత్నం మొదలు పెట్టారు. ముందుగానే ఏఈవోలు ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో తాలును శుభ్రం చేయించినా, ధాన్యం మిల్లు దగ్గరికి వెళ్లిన తర్వాత మళ్లీ తాలు ఉందంటూ అడ్డగోలుగా కోతలు పెడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొన్ని చోట్ల ధాన్యం దిగుమతి చేసుకోకుండా మళ్లీ వెనక్కి పంపిన ఘటనలు ఉన్నాయి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. నల్లగొండ జిల్లా కనగల్లు మండల పరిధిలోని ఓ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధాన్యం లారీకి 6 క్వింటాళ్లు కోతపెడతామని చెప్పడంతో రైతులు ఒప్పుకోలేదు. చివరకు వెనక్కి పంపించారు. మళ్లీ శుభ్రం చేసుకుని తీసుకెళ్లాక ఏకంగా 9 క్వింటాళ్లు కోతపెట్టడంతో రైతులతో పాటు ధాన్యాన్ని చెక్ చేసిన ఏఈవో కూడా షాకయ్యాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధితో చాలా చోట్ల ధాన్యం ఎంత శుభ్రంగా ఉన్నా, కోతలు పెట్టడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ పలు చోట్ల రోడ్లపై బైఠాయించి మండిపడుతున్నారు. ఏఈవోలు చెక్ చేసి పంపిన ధాన్యాన్ని మళ్లీ తాలు పేరుతో కోత పెట్టడం ఏంటి ప్రశ్నిస్తున్నారు. కోతలు లేకుండా ధాన్యం దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నిన్న యూరియా కొరత.. నేడు తాలు పేరుతో కోతలు
ఈ సీజన్ పంటసాగుకోసం అరిగోస పడినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ పేరుతో యూరియా దొరక్క అరిగోసపడ్డామని, చిరకు బ్లాక్ లో యూరియా కొని ధాన్యం పండించామని చెప్పారు. మాడపగిలే ఎండలో ధాన్యం ఆరబోసిన తర్వాత, చివరికి తాలు పేరుతో మిల్లు దగ్గర కట్ చేయడం ఏంటని మండిపడుతున్నారు. వ్యవసాయం చేయడం కంటే పడావు పెట్టడం మంచిదని తలబాదుకుంటున్నారు.
ధాన్యం అమ్ముకోలేక రైతుల ఆవేదన
ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు తప్పడం లేదంటున్నారు. అష్ట కష్టాలు పడి పంటను కోనుగోలు కేంద్రానికి తీసుకొస్తే, ఇక్కడ కూడా అమ్ముకునే పరిస్థితి లేదంటున్నారు. ఎండనకా, వాననకా వరిసాగు చేస్తే, అమ్ముకునే దగ్గరికి వచ్చేసరికి నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యంలో తాలు లేకుండా పట్టి కాంటాలు వేయించుకుంటే బాగుంటుందని ఏఈవోలు సూచిస్తున్నారు. నిర్ణీత పరిధిలో తేమశాతం ఉండటంతో పాటు తాలు, మట్టిపెళ్లలు లేకుండా చూసుకోవాలంటున్నారు. శుభ్రంగా ఉన్న ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఒకవేళ ధాన్యం శుభ్రంగా ఉన్నా మిల్లర్లు కొర్రీలు పెడితే, మండలానికి ఓ పర్యవేక్షణ అధికారి ఉన్నారని, వారికి రైతులు ఫిర్యాదు చేయాలంటున్నారు.
ప్రభుత్వ తీరుపై విపక్షాల ఆగ్రహం
మరోవైపు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులతో మాట్లాడుతున్నారు. వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏఈవోలు ధాన్యం పరిశీలన చేసి కాంటాలు అయిన ధాన్యానికి మళ్లీ తాలు పేరుతో కోతలు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. కాంటాలు అయిన ధాన్యానికి కూడా ఖాతాల్లో డబ్బులు పడేందుకు 10 రోజులకు పైగా సమయం పడుతుందంటున్నారు. ప్రభుత్వం 24 గంటల్లో డబ్బులు పడతాయని చెప్తున్నా, వాస్తవ పరిస్థితులు పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రైతుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.