Homeతెలంగాణవిద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి...!

విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి…!

  • విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి

  • మా నాన్న కేసీఆర్ ను తిట్టలేదు.. బీఆర్ఎస్ అధ్యక్షుడిని విమర్శించా

  • వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం

  • మీట్ ది ప్రెస్ లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

క్రైమ్ మిర్రర్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్: విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో…తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు.

రాళ్లతో కొట్టండి..

తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత తెలిపారు. అన్ని విషయాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే హామీలు ఇచ్చానని చెప్పారు. గత 20 ఏళ్లుగా తనను చూస్తున్నారని ఇచ్చిన మాట, పట్టిన తోవను విడవకుండా ఉన్నానని అన్నారు. తెలంగాణలో విద్య, వైద్యం కోసమే ప్రజలు 60 శాతం డబ్బు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కచ్చితంగా సంకల్పం తీసుకుంటే ఇది సాధ్యమేనని చెప్పారు. ఆరోగ్య శ్రీ ప్రారంభినప్పుడు, విద్యార్థులకు ఫ్రీ మీల్స్ పెట్టినప్పుడు కూడా ఇది సాధ్యమా అంటూ చాలా ప్రశ్నలు వచ్చాయన్నారు. కానీ ఇప్పుడు వాటిని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

పాంచజన్యంలోని ఐదు అంశాలను అమలు చేయటంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపానని కవిత చెప్పారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లక్ష కోట్ల రూపాయలను తమ ప్రాధాన్యత అంశాలకు ఖర్చు చేయవచ్చన్నారు. ఆ విధంగా చూస్తే చేయాలన్న సంకల్పం ఉంటే చాలు ఇదంతా సాధ్యమేనని స్పష్టం చేశారు. తల్లిలా తాను పరిణితి చెందుతానంటే చాలా మంది విమర్శలు చేశారని కవిత గుర్తు చేశారు. కానీ తల్లి మాదిరి లాలన లేని కారణంగానే ఇవ్వాళ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తే మాత్రమే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం వస్తుందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అది చేతకావటం లేదన్నారు. వెయ్యి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తల్లి మాదిరి పాలన చేస్తామన్నారు.

రాజకీయ నేత కేసీఆర్ పైనే నా విమర్శలు

ఇటీవల కేసీఆర్ పై కవిత చేసిన విమర్శలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చారు. తన విమర్శలు కేవలం బీఆర్ఎస్ అధినేత, రాజకీయ నేత అయిన కేసీఆర్ పైనేనని చెప్పారు. తండ్రిగా ఆయనతో తనకు ఎలాంటి సమస్య లేదన్నారు. సిద్దాంతపరమైన విబేధాలతోనే విమర్శలు చేశానని…రాజకీయ తప్పులపై భవిష్యత్ లోనూ విమర్శలు చేస్తానని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంతో చేయాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ అది చేయలేకపోయారన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వాడుకొని ఉంటే రైతుల చేతిలో రెండున్నర లక్షల కోట్లు ఉండేవని చెప్పారు. లక్షా 21 వేల కోట్లు కాళేశ్వరం, పాలమూరు కోసం ఖర్చు చేసి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో పెట్టిన పరీక్షల్లో పదిసార్లు పేపర్ లీక్ అవటాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ లాంటి తెలివైన ఐటీ మినిస్టర్ ఉండగా ఎందుకు పేపర్ లీకైందంటూ ప్రశ్నించారు. కేసీఆర్ చర్యల కారణంగా రెండు జనరేషన్లు నష్టపోయారన్నారు. లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనే విషయంలో కేసీఆర్ చేసిన తప్పులను మాత్రమే ప్రశ్నించానని స్పష్టం చేశారు.

పార్టీ పేరు విషయంలో వ్యూహం పాటించాం

తెలంగాణ రాష్ట్ర సేన అని ముందు ప్రకటించిన తర్వాత తెలంగాణ రక్షణ సేన గా పేరు మార్చుకోవటాన్ని జర్నలిస్టులు ప్రశ్నించారు. ఐతే తమ పార్టీ పేరు విషయంలో చాలా కుట్రలు జరిగాయని కవిత చెప్పారు. వాటిని గమనించిన తర్వాతే పార్టీ పేరు విషయంలో వ్యుహత్మకంగా వ్యవహరించామని అన్నారు. కావాలనే రకరకాల పేర్లను ప్రచారంలోకి తెచ్చామని చెప్పారు. ఐతే టీఆర్ఎస్ అనే పేరు రావటం మాత్రం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ తనకు రాసిపెట్టి ఉండటం దైవ సంకల్పమేనని భావిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ ఏర్పడిన కొత్తలో కూడ బస్సు, నాగలి గుర్తు అంటూ చాలా గందరగోళం జరిగిందని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో సాంకేతిక అంశాలు చాలా ఉంటాయన్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

విమర్శించే వాళ్లను పట్టించుకోం

కవిత పార్టీ ఏర్పాటును కాంగ్రెస్, బీజేపీ, సహా కేటీఆర్ తక్కువ చేసి మాట్లాడటంపై కవిత స్పందించారు. బీజేపీ నేతలు ముందు తెలంగాణకు మేలు చేసే పని చేయాలని సూచించారు. ఈ నెల 10 న రాష్ట్రానికి వస్తున్న మోడీని అడిగి పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తేవాలని, తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు తేవాలని చెప్పారు. అది చేయకుండా తనను విమర్శిస్తే ఏమొస్తుందని ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి బద్ద విరోధి అయిన బీజేపీ, తెలంగాణకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలు మాట్లాడే మాటలు పట్టించుకోనని చెప్పారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ప్రజలకు మంచి చేసేందుకు పార్టీ పెట్టే ప్రయత్నం చేసేప్పుడు ఇలాంటి చాలా మాటలే వస్తాయన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో పార్టీ ఉండటమే పవర్ అని చెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది ఆ పార్టీ నడిపే వ్యక్తి సిన్సియారిటీని బట్టి ఉంటుందన్నారు. ఒక పార్టీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్న వాళ్లు వారి మాటలను ప్రజలు గమనిస్తారని గుర్తుంచుకోవాలని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. టీఆర్ఎస్ పెట్టినప్పుడు జెండా మోసే వాళ్లు కూడా లేరన్నారు. చిన్న పార్టీగా మొదలై వటవృక్షంలా టీడీపీ, బీఆర్ఎస్ లు ఎదిగాయని గుర్తుచేశారు. ఎవరెన్ని విమర్శలు చేసిన దాన్ని మేము మనసు మీదకు తీసుకోమని చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాటమే తమ లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ కు విలన్ ఎవరో నాకు వాళ్లే విలన్

తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ అని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తనకు టార్గెట్ కాదన్నారు. తెలంగాణకు ఎవరు విలన్ ఉంటే తనకు వాళ్లే విలన్ అని చెప్పారు. తన పర్సనల్ అజెండాను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లనని స్పష్టం చేశారు. తాను ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పారు. పర్సనల్ కష్టాలు, రాజకీయ కష్టాలు ఉన్నాయన్నారు. రాజకీయ కష్టాలను మాత్రమే ప్రజలకు చెబుతానని అన్నారు. తన వెనుక ఎవరు లేరని మరోసారి తేల్చిచెప్పారు. నిప్పుల నుంచి నడిచి వచ్చిన తనకు ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి ఉందని తేల్చిచెప్పారు. ఎవరో తన వెనుక ఉండాల్సిన అవసరం లేదన్నారు. తన వెనుక తానే ఉన్నానని కవిత స్పష్టం చేశారు.

పురుషుల కన్నా గొప్పగా నడుపుతాం

తమ పార్టీని పురుషులు నడిపే పార్టీ కన్నా గొప్పగా నడుపుతామని కవిత చెప్పారు. దేశంలో ఎంతో మంది మహిళలు సమర్థవంతంగా పరిపాలించారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో పార్టీని నడుపుతామన్నారు. తమ పార్టీలో కచ్చితంగా మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని కవిత చెప్పారు. మహిళ బిల్లు పాసైన కాకపోయిన సరే తాము మాత్రం 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసే ముందు కనీసం వివరణ అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రోహిత్ రెడ్డి కి మాత్రం షోకాజ్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా క్షేత్రంలో ఉండాలని భావించే తనకు బీజేపీ డీఎన్ఏ తో సరిపోలదన్నారు. తెలంగాణకు అన్యాయం చేసేందే కాంగ్రెస్ అని చెప్పారు. అలాంటి పార్టీల్లో ఉండలేనని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ప్రజల మధ్యలో ఉండాలనే ఉద్దేశంతోనే పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. అభివృద్ధి, సామాజిక న్యాయం జోడెద్దులుగా తాము ముందుకు వెళ్తామన్నారు.

అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ పవర్ ఉండాలి

తమ పార్టీ భావసారూప్యం గల పార్టీలతో ఫ్రీ పోల్స్ అలయెన్స్ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా ఉందన్నారు. ఐతే భావసారూప్యం లేని వారితో మాత్రం పొత్తులు పెట్టుకునేది లేదన్నారు. పోస్ట్ పోల్ అలయెన్స్ అవసరం ఉంటుందని భావించటం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు తమకు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇస్తారని భావిస్తున్నానని కవిత చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి అంత కూడా తెలంగాణ రాజకీయాలపైనే ఉందన్నారు. జాతీయ అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే స్పందిస్తామని చెప్పారు. డీలిమిటేషన్ విషయంలో తమకు స్పష్టమైన వైఖరి ఉందని చెప్పారు. అమెరికాలో సెనేట్ కు ఉన్న పవర్స్ మాదిరిగా రాష్ట్రాలకు పవర్ ఇవ్వాలన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ ఓటింగ్ రైట్స్ ఉండాలన్నారు. ఈ విషయంలో డీటెయిల్ గా ప్రధాని మోడీకి లేఖను కూడా పంపుతున్నట్లు చెప్పారు.

మాజీ మావోయిస్టులు పార్టీల్లో చేరాలి

సొంత ప్రజలను డైడ్ లైన్ పెట్టి చంపుతున్నది కేంద్ర ప్రభుత్వమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేపట్టిన దుర్మార్గాన్ని ముందుగా ఖండించింది తనేనని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ఏదో ఒక పార్టీలో చేరాలని కోరారు. తెలంగాణ రక్షణ సేన వారికి స్వాగతం పలుకుతుందన్నారు. ఇష్యూ బేస్డ్ గా పాదయాత్ర చేస్తామని చెప్పారు. జర్నలిస్టులు, మైనార్టీలు, బీసీ అన్ని వర్గాల కోసం పోరాటం చేస్తామని కవిత చెప్పారు.

కొత్తదనాన్ని ప్రజలు ఆదరిస్తారు

ప్రజల కోసం ముందుకు వస్తున్న తమకు కచ్చితంగా ప్రజల ఆదరణ ఉంటుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఐతే తన నడవడిక, ఆచరణ చూశాక ప్రజలు తనను నమ్ముతారని తెలుసన్నారు. ఐతే గతంలో కొత్తదనాన్ని ఆహ్వానించిన చరిత్ర ఈ నేలకు ఉందన్నారు. కచ్చితంగా తమను కూడా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పాంచజన్యం పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి మోడరేటర్ గా వ్యవహరించగా టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రాం నారాయణ పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు