HomeజాతీయంCET Controversy: జంధ్యం వివాదంపై ప్రభుత్వం స్పందన, సిబ్బంది సస్పెండ్!

CET Controversy: జంధ్యం వివాదంపై ప్రభుత్వం స్పందన, సిబ్బంది సస్పెండ్!

Karnataka CET Row: కర్ణాటకలో నిర్వహించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET) సందర్భంగా సిబ్బంది వ్యవహారం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగిన ఈ పరీక్షలో, కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులను జంధ్యం తొలగించిన తర్వాతే లోపలికి అనుమతించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది.

కృపానిధి కాలేజీ పరీక్షా కేంద్రంలో సంఘటన

బెంగళూరులోని కృపానిధి కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. పరీక్షకు వచ్చిన ఒక విద్యార్థిని సిబ్బంది జంధ్యం తీసేయాలని చెప్పారు. మొదట అతను కొంతసేపు వేచి చూసినా, పరిస్థితి మారకపోవడంతో చివరకు జంధ్యాన్ని తొలగించి పరీక్ష రాయడానికి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అదే కేంద్రంలో మరో కొందరు విద్యార్థులు చేతికి కట్టుకున్న పవిత్ర దారాలను కూడా తీసేయాల్సి వచ్చిందని సమాచారం.

నాగార్జున కాలేజీ పరీక్షా కేంద్రంలో కూడా!

ఇలాంటి ఘటన చిక్కబళ్లాపుర జిల్లాలోని నాగార్జున కాలేజీ పరీక్షా కేంద్రంలో కూడా చోటుచేసుకుంది. దీంతో ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది. కృపానిధి కాలేజీలో జరిగిన ఘటనపై బాధిత విద్యార్థి మడివాళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

హిందూ సంఘాల ఆగ్రహం

ఈ విషయంపై రాజకీయ నాయకులు కూడా స్పందించారు. శాసనసభ ప్రతిపక్ష నేత అశోక్, బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్వి సూర్య నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్‌ను కలిసి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు జరగకూడదని వారు అభిప్రాయపడ్డారు.

వివాదం తీవ్రత పెరగడంతో ప్రభుత్వం స్పందించింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులైన కృపానిధి సంస్థలో పనిచేసే అధ్యాపకుడు సుధీర్, క్లర్క్ సరిత, అటెండర్ గిరిజను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అమలు చేసే నిబంధనలు విద్యార్థుల భావాలను గౌరవించేలా ఉండాలనే చర్చ ఈ ఘటనతో మళ్లీ ముందుకు వచ్చింది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు