Homeట్రావెల్ఎక్కడి బస్సులు అక్కడే...!

ఎక్కడి బస్సులు అక్కడే…!

  • ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ స్వయంకృతాపమే

  • విపక్షాల కుట్ర అంటే..అది ప్రభుత్వ అసమర్ధతే

  • మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఇది సవాల్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎక్కడివక్కడే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అయితే ఈ సమ్మె ఉదాంతం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెద్ద సవాల్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం స్వయంకృతాపమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పుడే చర్చలు జరిపి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు అనేది ఒక అభిప్రాయం. ఆర్టీసీ సమ్మె ప్రారంభం అయిన తర్వాత గులాబీ పార్టీ కుట్రగా అభివర్ణించడం అంత సమంజసం కాదు. ముందుగా కార్మికులతో చర్చించాల్సిన ప్రభుత్వం కాలాన్ని వృధా చేసింది. దీంతో ఆర్టీసీ సమ్మె మరింత జఠిలం అయింది.

అత్యంత సీనియర్ నేత..
ప్రస్తుతం తెలంగాణ సర్కారులో రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. తన శాఖ పరిధిలో ఆయన చురుగ్గా వ్యవహరించాలి. తన సీనియారిటీని ప్రదర్శించాలి. కానీ ఆయన అలా చేయలేదు. ఆర్టీసీ సమ్మె ఉధృతం అవుతుంటే అది ప్రతిపక్షాల కుట్రగా ఆయన అభివర్ణించడం ఎంత మాత్రం తగదు. ప్రతి చిన్న సమస్యకు ప్రతిపక్షాలే కారణమని ఆరోపించడం.. తన బాధ్యత నుంచి తప్పించుకోవడమే అనే విమర్శ మోట కొట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే ఒకే ఒక్క మాటతో కార్మిక లోకాన్ని వణికించారు. అప్పట్లో సమ్మెను పూర్తిగా నీరు గార్చారు. అటువంటి భయం కార్మికుల్లో ఇప్పటికీ ఉంది. కానీ ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం తాము ప్రజాస్వామ్యవాదులమని చెప్పేందుకు ఆరాటపడుతోంది. అందుకే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం అంటే లెక్కచేయకుండా సమ్మెబాట పట్టాయి. ప్రభుత్వం కార్మిక నేతలతో చర్చించి తమ దారిలోకి తెచ్చుకోవాలి తప్ప.. ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉందంటూ చెప్పడం ఎంత మాత్రం సహేతుకం కాదు.

ప్రభుత్వానికి ఇబ్బంది కరం..
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ సమ్మె నిజంగా ఇబ్బందికరమే. అయితే ఈ విషయంలో ఇంటలిజెన్స్ తో పాటు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికులు సమ్మెకు సిద్ధపడినప్పుడే కార్మిక సంఘాల నేతలను పిలిపించి చర్చలు జరపాల్సింది. కేవలం విపక్షాలు రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో కార్మిక సంఘాలు ఉన్నాయంటే.. ప్రభుత్వం అంటే లెక్కలేని తనం కూడా బయటపడినట్లు అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం విమర్శలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో కార్మిక సంఘాలతో బలమైన నెట్వర్క్ ఏర్పరచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

నిజంగా అసమర్థత..
కాంగ్రెస్ అధికారపక్షంగా ఉంది. ప్రభుత్వానికి అన్ని వ్యవస్థలతో పాటు అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటే.. దానిని అడ్డుకోలేని స్థితిలో ఉంటే ఏమనుకోవాలి. ఇది ముమ్మాటికి అసమర్ధత కిందకి వస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో విపక్షాల కుట్ర ఉందనుకుందాం. అయితే దానిని ముందుగానే గుర్తించాల్సిన బాధ్యత ఇంటలిజెన్స్ పై ఉంది. పైగా పొన్నం ప్రభాకర్ ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేదు. దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారు. అటువంటి నేత తన సొంత శాఖలో జరుగుతున్న పరిణామాలపై ముందస్తుగా ఆలోచన చేయకపోతే దానిని ఏమనాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మాత్రం ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే చివరికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ప్రభుత్వం ఇరకాటంలో పడడం ఖాయం.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు