Homeక్రైమ్మర్రిగూడ ఎస్సై అరాచకాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి..!

మర్రిగూడ ఎస్సై అరాచకాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి..!

  • రక్షణ కవచం కావాల్సిన ఖాకీ అండతోనే బాధితులపై అక్రమ కేసులు

  • మర్రిగూడ ఎస్సై అరాచక పర్వంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి

  • తక్షణమే వేటు వేయాలని జిల్లా ఎస్పీకి ఫోన్ కాల్.

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): మర్రిగూడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ, ఒక అధికారి వ్యక్తిగత స్వార్థం, మొండివైఖరి కారణంగా అప్రతిష్ట పాలవుతోంది. బాధితులకు అండగా నిలవాల్సిన ఎస్సై, విచక్షణారహితంగా వ్యవహరిస్తూ, న్యాయం కోరిన వారిపైనే అక్రమ కేసులు బనాయించడం మండలంలో కలకలం రేపుతోంది. వెంకెపల్లి తండాకు చెందిన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటూ, సెల్ఫీ వీడియోలో ఆయన కుమారుడిని ముందు పెట్టుకొని తన గోడును వెళ్లబోసుకున్నాడు..

ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమైన సదరు అధికారి, బాధితుల పక్షాన నిలిచిన 15 మంది అమాయకులపై కేసులు నమోదు చేయడం, ఆయన వికృత ధోరణికి పరాకాష్టగా నిలుస్తోంది. బాధితులు తమ ఆవేదనను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆ సెల్ఫీ వీడియోను పరిశీలించిన ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రక్షక భటులే భక్షకులుగా మారితే సహించేది లేదని, విధి నిర్వహణలో విఫలమై, బాధితులను వేధింపులకు గురిచేస్తున్న, ఈ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించి మర్రిగూడ నుండి పంపించివేయాలని జిల్లా ఎస్పీని ఆయన కోరారని సమాచారం..

సదరు ఎస్సైపై గతంలో విఆర్ లో ఉన్నప్పటి నుండే అనేక విమర్శలు ఉన్నాయని, మర్రిగూడలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన తీరు, మరింత వివాదాస్పదంగా మారిందని మండల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కేవలం కేసుల మాఫీ కోసమే కాకుండా, పేకాట శిబిరాల వద్ద పట్టుబడిన నిందితుల నుండి, మధ్యవర్తుల ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లెంకలపల్లి పేకాట కేసులో ఒక మాజీ ప్రజా ప్రతినిధి ఖాతా ద్వారా నగదు బదిలీ చేయించుకుని, పెట్రోల్ బంక్ వద్ద నగదు మార్పిడి చేసుకున్నారనే, ప్రచారం పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తోందనే చెప్పుకోవాలి.

విందులు, వినోదాల కోసం రిసార్టులు, గెస్ట్ హౌస్‌లలో కాలక్షేపం చేస్తూ, స్థానిక మర్రిగూడలో హోటల్ బిల్లులను సైతం ఫిర్యాదుదారుల చేత, కట్టించే స్థాయికి ఈ అధికారి దిగజారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తితో హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకున్న యువకులపై, డీజేల నెపంతో తప్పుడు కేసులు పెట్టడం, ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ వార్డు మెంబర్ కుటుంబానికి సంఘీభావం తెలిపిన వారిని, నేరస్థులుగా చిత్రీకరించడం చూస్తుంటే, చట్టంపై కనీస గౌరవం లేని అధికారి చేతిలో, మండలం బందీ అయిందని స్పష్టమవుతోంది.

ఈ అరాచక శైలిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే, బాధితులే రోడ్లపైకి వచ్చి పోరాటం చేసే ప్రమాదం ఉందని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం కలగాలంటే, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎస్సైపై, శాఖాపరమైన చర్యలు తీసుకోవడం అత్యవసరంగా కనిపిస్తోంది.. నిఘా వర్గాలు ద్రుష్టి సారించి ఉన్నత అధికారులకు నివేదిక ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. నాంపల్లి మండలంలోని అధికార పార్టీ నేత, అండదండలే ఈ అరాచకాలను ప్రధాన కారణమా అంటూ ఆ నేతపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు