-
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
-
దక్షిణ మధ్య రైల్వే సైతం సానుకూలం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :గ్రేటర్ హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు రవాణా కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటిఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం పేద కుటుంబాలపై రవాణా భారం తగ్గించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే నిధుల సర్దుబాటుకు…
సాధారణంగా ఎంఎంటీఎస్ రైళ్లలో నిరుపేదలతో పాటు మధ్యతరగతి వారు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రైళ్ల ద్వారా ఏడాదికి దక్షిణ మధ్య రైల్వేకు 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుతోంది. అయితే ఈ రైళ్లలో ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక పెరిగే ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా.. ప్రస్తుత ఆదాయాన్ని తాము సర్దుబాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తో తెలంగాణ సిఎస్ రామకృష్ణారావు చర్చలు జరిపారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏడాది పాటు ప్రయోగాత్మకంగా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
భాగ్యనగరం ప్రజలకు భారం తగ్గనుంది…
భాగ్యనగరం వాసులకు ఈ ఉచిత ప్రయాణం ఎంతగానో దోహదపడనుంది. అందుకే ఈ ఎంఎంటిఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలను లేఖలో ప్రస్తావించారు. జూన్ రెండు నుంచి ఏడాది పాటు ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని పేర్కొన్నారు.
ఈ లేఖపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. ఎంఎంటీఎస్ లలో ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి ముసాయిదా ఎంవోయూను పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ముసాయిదా ఎంవో యూనివర్సిటీ రైల్వే బోర్డు అనుమతి తీసుకుంటామని పేర్కొంది. మొత్తానికి అయితే భాగ్యనగరం ప్రజలకు రవాణా భారం కొంతవరకు తగ్గనుంది అన్నమాట.