Homeజాతీయంమహిళా బిల్లు అడ్డగింతపై ప్రధాని మోదీ ధ్వజం.. స్వార్థ రాజకీయాలకే విపక్షాల ప్రాధాన్యం

మహిళా బిల్లు అడ్డగింతపై ప్రధాని మోదీ ధ్వజం.. స్వార్థ రాజకీయాలకే విపక్షాల ప్రాధాన్యం

భారత నారీశక్తి ఎదుగుదలను విపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో శనివారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళల కలలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా విపక్షాలు వ్యవహరించాయని విమర్శించారు. దేశ హితం తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్న ప్రధాని.. కొందరికి మాత్రం దేశం కంటే రాజకీయాలే ప్రాధాన్యతగా మారాయని మండిపడ్డారు

కుటుంబ పార్టీల స్వార్థం

మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తీరును మోదీ ఎండగట్టారు. ఇలాంటి కుటుంబ పార్టీలు మహిళలు రాజకీయంగా ఎదగడాన్ని ఏమాత్రం ఇష్టపడవని స్పష్టం చేశారు. ఆ పార్టీలు ఓడించింది కేవలం ఒక బిల్లును మాత్రమే కాదని.. కోట్లాది మంది మహిళల శక్తిని అని ప్రధాని అభివర్ణించారు. తమకు జరిగిన ఈ అన్యాయాన్ని దేశంలోని మహిళలు ఎప్పటికీ మర్చిపోరని హెచ్చరించారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ హితమే మా లక్ష్యం

దేశ ప్రయోజనాల కోసం మహిళా శక్తి సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని మోదీ వివరించారు. మహిళా శక్తి సామర్థ్యాలను ఈ దేశం ఇంకా పూర్తిస్థాయిలో చూడాల్సి ఉందన్నారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం నారీ శక్తిని అడ్డుకోవడమే విపక్షాల అజెండాగా మారిందని విమర్శించారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్న పార్టీలకు భవిష్యత్తులో తప్పకుండా శిక్ష పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

మహిళల ఆత్మగౌరవంపై దాడి

రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను పక్కన పెట్టడం విపక్షాలకు అలవాటుగా మారిందని మోదీ ఆరోపించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకూడదనే కుట్రతోనే బిల్లును వీగిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళా బిల్లు విషయంలో విపక్షాల వైఖరి వారి పాత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. నారీ శక్తిని తక్కువగా అంచనా వేసే వారికి కాలమే సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళల సాధికారత దిశగా తమ పోరాటం ఆగిపోదని.. మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ విపక్షాల వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మహిళా బిల్లు వైఫల్యానికి కారణమైన పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని.. వారు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: ఉద్యమకారులను జైల్లో పెట్టడం ఏంటి..? కవిత ఆగ్రహం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు