రాజన్న సిరిసిల్ల, క్రైమ్ మిర్రర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో పెండింగ్ బిల్లుల విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ, తన సొంత ఖర్చుతో నిర్మించిన పాఠశాల భవనాలకు సంబంధించిన బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ దాదాపు రూ.22 లక్షల వ్యయంతో జడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్ పాఠశాల భవనాలను నిర్మించించినట్లు తెలిపారు.
అయితే ఈ పనులకు సంబంధించిన బిల్లులు ఏడాది కాలంగా మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆమె పేర్కొన్నారు. అప్పులు చేసి భవనాలు కట్టించామని, పలుమార్లు అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్ దంపతులు పాఠశాల భవనానికి తాళం వేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల స్పందన, తదుపరి చర్యలపై స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
