-
ఖానాపూర్ మున్సిపాలిటీ తో సంకేతం
-
రెండు పార్టీల కలయిక అనివార్యం
-
కాంగ్రెస్ ను ఢీ కొట్టాలంటే కలవాల్సిందేనంటున్న కేడర్లు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. బిజెపితో బిఆర్ఎస్ చేతులు కలపడం సరికొత్త సంకేతం. భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి అన్న ఊహాగానాల నేపథ్యంలో.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీని సంయుక్తంగా గెలుచుకున్నాయి. అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. రెండు నెలల కిందట మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
కానీ ఖానాపూర్ లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ బిజెపి తరఫున నలుగురు, బిఆర్ఎస్ తరఫున నలుగురు, కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు, ఇండిపెండెంట్ గా ఒకరు గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాలుగురు సభ్యుల మద్దతు దక్కినట్టు అవుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ రాజీ పడింది. బిజెపికి మద్దతు తెలిపింది. దీంతో బీజేపీ నేత చైర్మన్ గా, బిఆర్ఎస్ నేత వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
సరికొత్త సంకేతం..
తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలకు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కానీ అనూహ్యంగా బిజెపి 8 స్థానాలతో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడింది. అప్పటినుంచి తెలంగాణ అధికార పీఠంపై కన్నేసింది బిజెపి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో పట్టు లేదు. అదే సమయంలో గులాబీ పార్టీకి క్షేత్రస్థాయిలో బలము ఉంది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్లేషణలు ఉన్నాయి.
గత కొంతకాలంగా ఊహాగానాలు..
గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో గులాబీ పార్టీ బిజెపితో జత కట్టడం ఖాయమన్న ప్రచారం నడిచింది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నిలువరించాలంటే కమలంతో దోస్తీ ఏకైక మార్గం అని గులాబీ పార్టీ భావిస్తోందట. అయితే తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం చాలా కష్టం. అధికారంలోకి రావాలంటే పొత్తుల ద్వారానే సాధ్యం. ఇప్పటికే ఏపీలో టిడిపి తో పాటు జనసేనతో పొత్తు పెట్టుకుంది బిజెపి. కానీ తెలంగాణలో ఆ రెండు పార్టీలు వీక్. కళ్ళెదురుగా కనిపిస్తోంది బిఆర్ఎస్. పైగా కెసిఆర్ పార్టీ కష్టాల్లో ఉంది. ఆ పార్టీ నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. అందుకే బిజెపితో కలవక తప్పని అనివార్య పరిస్థితి.
బిజెపిలో భిన్న వైఖరి..
గులాబీ పార్టీతో పొత్తు విషయంలో బిజెపి భిన్న వైఖరితో ఉంది. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న వారు కచ్చితంగా పొత్తు పెట్టుకోవాలని కోరుతున్నారు. కానీ కెసిఆర్ పార్టీ అవినీతి మరక బిజెపికి అంటుకుంటుందని.. గతంలో కాంగ్రెస్ పార్టీని నమ్మించి మోసం చేసిన చరిత్ర కెసిఆర్ దని.. అందుకే అంత సులువుగా ఆయనను నమ్మకూడదని బిజెపిలో ఒక వర్గం భావిస్తోంది. కానీ ఇప్పుడు పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖానాపూర్లో ఆ రెండు పార్టీల కలయిక నేపథ్యంలో.. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితిని కొనసాగిస్తాయని విశ్లేషణలు మొదలయ్యాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..
