HomeతెలంగాణCPI vs Congress: కాంగ్రెస్ తో సిపిఐ కటీఫ్.. సాంబశివరావు ఆగ్రహం అందుకేనా?

CPI vs Congress: కాంగ్రెస్ తో సిపిఐ కటీఫ్.. సాంబశివరావు ఆగ్రహం అందుకేనా?

* పంచాయితీ ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ

* మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ప్రత్యర్ధులుగా తలపడి

* కాంగ్రెస్ వైఖరి పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఆగ్రహం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీతో కటీఫ్ చెప్పేందుకు సిపిఐ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని సిపిఐ కి కేటాయించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  సాంబశివరావు పోటీ చేసి గెలిచారు. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూనమనేని సాంబశివరావుకు విభేదాలు పెరిగినట్లు ప్రచారం సాగుతోంది. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీరు వీరి పాలన అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమంలో.. అధికారుల సమక్షంలోనే ప్రభుత్వం పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.దీంతో సిపిఐ కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.

కొత్తగూడెం పై పట్టు..

మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీ పేరిట కాంగ్రెస్, సిపిఐ వేర్వేరుగా పోటీచేసాయి. ఇద్దరికీ కాస్త అటు ఇటుగా సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ఎక్కువ అన్న చర్చ జరుగుతున్న క్రమంలో విభేదాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో సీట్ల పరంగా కాంగ్రెస్.. ఓట్ల పరంగా సిపిఐ ప్రథమ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెంలో తమకు బలం ఉందని సిపిఐ పట్టుబట్టి మరి ఈ సీటును తీసుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తమ బలంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన భావన. పంచాయితీ ఎన్నికల్లో సైతం తమకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆయన వాదిస్తున్నట్లు కనిపిస్తోంది.

తీవ్ర మనస్తాపంతో సిపిఐ..

కాంగ్రెస్ పార్టీతో సిపిఐ స్నేహంగా ఉన్నా లోలోపల మాత్రం మనస్తాపంతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో స్నేహంగా ఉంటాం కానీ.. సమస్యల విషయంలో మాత్రం తాము ప్రజల పక్షం ఉంటామని సాంబశివరావు హెచ్చరించారు. ఓట్లతోపాటు సీట్ల కోసం అర్రులు చాచే రకం కమ్యూనిస్టులు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. తద్వారా అవసరం అనుకుంటే కాంగ్రెస్ స్నేహాన్ని వదులుకునేందుకు సిద్ధం అని ఆయన సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ మధ్య దోస్తీ కుదిరింది. ఆ ఎన్నికల్లో రెండు పక్షాలు కలిసి పోటీ చేశాయి. కానీ పంచాయతీ ఎన్నికల నాటికి స్నేహపూర్వక పోటీ కొనసాగింది. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి పొత్తు పెటాకులైంది. పైగా కాంగ్రెస్ వైరిపక్షమైన గులాబీ పార్టీతో సిపిఐ దోస్తీకి దిగింది. మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సిపిఐ అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధానంగా కొత్తగూడెం కార్పొరేషన్, ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం, మహబూబాబాద్, మంచిర్యాల, జనగామ తదితరచోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ సీట్లు ఆశించింది సిపిఐ. కానీ సిపిఐ కు అంత ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కాంగ్రెస్ భావించింది. అందుకే సిపిఐ ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి దిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకుని.. మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ మాట మార్చడాన్ని సిపిఐ జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో కూనంనేని సాంబశివరావు  తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విచ్ఛిన్నం అయితే.. కచ్చితంగా గులాబీ పార్టీ సిపిఐ ని చేరదీస్తుంది. అందుకే తెలంగాణ రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments