తెలంగాణలో విద్వేషపూరిత వ్యాఖ్యల నియంత్రణకు కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు అసెంబ్లీలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లును స్పీకర్ సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మరింత పరిశీలనకు సూచించారు. ఇప్పటికే గత సోమవారం రాష్ట్ర మంత్రి మండలి ఈ బిల్లుకు ఆమోదం తెలపడం గమనార్హం. సమాజంలో మతం, కులం, లింగం వంటి అంశాల ఆధారంగా విభేదాలు రేకెత్తించే ప్రసంగాలు, రచనలు, సోషల్ మీడియా పోస్టులను అరికట్టడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ బిల్లు ప్రకారం విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలు లేదా పోస్టులు చేసినవారిపై కఠిన శిక్షలు విధించనున్నారు. మొదటిసారి నేరం రుజువు అయితే గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా విధించబడుతుంది. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే శిక్ష మరింత పెరిగి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించారు. ముఖ్యంగా ఈ నేరాలను నాన్ బెయిలబుల్‌గా పరిగణించడం ద్వారా చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. దీని ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలపై కట్టడి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సమాజంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా ఈ బిల్లులో విస్తృత పరిధిని చేర్చారు. మతం, జాతి, కులం, వర్గం, స్త్రీ, పురుష, లైంగిక అంశాలు, జన్మస్థలం, నివాసం, భాష, అశక్తత, తెగలు వంటి విభిన్న అంశాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. సభలు, సమావేశాలు, సంఘాల్లో మాత్రమే కాకుండా మాటల రూపంలో, ముద్రణ రూపంలో, ప్రచురణల ద్వారా లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా చేసే సమాచార మార్పిడి కూడా ఈ చట్టానికి లోబడి ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా వ్యాపించే ద్వేషపూరిత కంటెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేందుకు సంబంధిత వేదికలు, సేవలందించే సంస్థలకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కూడా అధికారులకు కల్పించింది.
ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత సోషల్ మీడియా లేదా ఇతర వేదికల్లో ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇక సులభం కాదని స్పష్టం అవుతోంది. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చలు కూడా కొనసాగుతున్నాయి.
ALSO READ: వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా?.. అయితే ఇలా చేయండి!
