ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్‌ను సాధారణంగా చాలా మంది నేరుగా ఉపయోగించడం మొదలుపెడతారు. కానీ భద్రత పరంగా చూసుకుంటే, దాని మీద ఉన్న కోడ్‌ను ముందుగా పరిశీలించడం అత్యంత అవసరం. సిలిండర్‌పై కనిపించే చిన్న అక్షరాలు, సంఖ్యలు చాలా పెద్ద సమాచారాన్ని ఇస్తాయి. ఈ కోడ్‌ను సరిగ్గా అర్థం చేసుకుంటే, ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు. ముఖ్యంగా కుటుంబ భద్రత కోసం ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవడం తప్పనిసరి.
గ్యాస్ సిలిండర్ పైభాగంలో ఉన్న మెటల్ పట్టీలపై సాధారణంగా A-25, B-26, C-27, D-28 వంటి కోడ్‌లు ముద్రించి ఉంటాయి. ఈ కోడ్‌లో మొదట కనిపించే అక్షరం సంవత్సరంలోని త్రైమాసికాలను సూచిస్తుంది. అంటే A అంటే జనవరి నుంచి మార్చి వరకు, B అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, C అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అనే అర్థం. ఈ అక్షరానికి పక్కన ఉండే రెండు అంకెలు ఆ సంవత్సరం సూచనగా ఉంటాయి. ఉదాహరణకు B-26 అని ఉంటే, అది 2026 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఆ సిలిండర్‌కు నాణ్యత పరీక్ష జరగాల్సి ఉందని అర్థం.
అయితే చాలా మంది ఈ కోడ్‌ను సిలిండర్ గడువు తేదీగా పొరబడుతుంటారు. కానీ వాస్తవానికి ఇది గడువు ముగిసే తేదీ కాదు. ఇది టెస్ట్ డ్యూ డేట్ మాత్రమే. అంటే ఆ తేదీ వచ్చే సరికి సిలిండర్‌ను మళ్లీ పరీక్షించాలి. ఆ పరీక్షలో సురక్షితంగా ఉందని తేలితేనే తిరిగి గ్యాస్ నింపి వినియోగానికి ఇస్తారు. ఒకవేళ పరీక్షలో విఫలమైతే ఆ సిలిండర్‌ను పూర్తిగా వినియోగం నుంచి తొలగిస్తారు. కాబట్టి ఈ కోడ్‌ను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
ఇంటికి వచ్చే సిలిండర్‌పై ఉన్న కోడ్ ప్రస్తుత సంవత్సరానికి తగ్గట్టుగా ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. ఉదాహరణకు ప్రస్తుతం 2026 ఉంటే, సిలిండర్‌పై B-24 వంటి పాత కోడ్ ఉంటే వెంటనే గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. అలాగే ఏదైనా అనుమానం కలిగినా లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే 1906 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ఉత్తమం.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం ఎల్‌పిజి కేటాయింపులను 70 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా స్టీల్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగం మరింత పెరుగుతున్న తరుణంలో, గృహ వినియోగదారులు సైతం భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమైంది. చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.
