టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి బృందం పైనే విమర్శనాస్త్రాలు
ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు నిర్ణయం
కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ తప్పదా?
ఉత్తర తెలంగాణలో మారనున్న రాజకీయ సమీకరణలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు జీవన్ రెడ్డి. రాజీనామా చేస్తూ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తో తాడో పేడో తేల్చుకుంటానని శపధం చేశారు. సీఎం కుర్చీ నుంచి దించేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. రేవంత్ టార్గెట్ గానే జనం బాట పడతానని చెప్పేశారు. ఈ తరుణంలో జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పెద్దాయన ఆలోచన ఏంటి? ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఎంత? అనే దానిపై చర్చ నడుస్తోంది.
తీవ్ర అసంతృప్తి తో పాటు ఆవేదన నడుమ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ హై కమాండ్ బుజ్జగింపులకు ఆయన లొంగలేదు. తనకు ఆత్మ అభిమానమే ముఖ్యం అంటూ కాంగ్రెస్ పార్టీతో ఉన్న నాలుగు దశాబ్దాల బంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. తన పట్ల హై కమాండ్ తీరును తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ..
తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారు జీవన్ రెడ్డి. నందమూరి తారక రామారావు తో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అది మొదలు కాంగ్రెస్ భావజాలాన్ని, సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అటువంటి నేతను కాంగ్రెస్ పక్కన పెట్టింది.
గులాబీ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకుంది. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేక పోయారు. గత కొద్ది నెలలుగా తాను నరకం చూసినట్లు చెబుతున్నారు జీవన్ రెడ్డి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం సీఎం రేవంత్ అని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ప్రజల్లోకి వెళ్లాలని బలంగా నిశ్చయించుకున్నారు. కెసిఆర్ తో పాటు కేటీఆర్ కు కావాల్సింది ఇదే. పదునైన విమర్శనాస్త్రాలతో జీవన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
రేవంత్ బృందం పై విమర్శలు..
ప్రధానంగా రేవంత్ డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ప్రభుత్వంలో స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని సలహాదారు పదవి ఇవ్వడాన్ని కూడా ఎండగట్టి అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి కనీస సేవలు అందించని వేం నరేందర్ రెడ్డి కి సలహాదారు పదవితో పాటు రాజ్యసభ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒక ఆలోచన తేవాలన్న కోణంలో ఆలోచిస్తున్నారు జీవన్ రెడ్డి. కేవలం కాంగ్రెస్ పాతతరం నేతల జోలికి పోకుండా.. రేవంత్ టీమును ఎండగట్టాలని జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ దూకుడుకు కళ్లెం..
రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని జీవన్ రెడ్డి ద్వారా కెసిఆర్ గట్టిగానే ప్లాన్ చేసినట్లు స్పష్టం అవుతోంది. తొక్కుకుంటూ పోతానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎంతమందిని తొక్కుకుంటూ పోతావు అంటూ ప్రశ్నిస్తున్నారు.
దానం నాగేందర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఉండగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయించడం దేనికి సంకేతం అని నిలదీసినంత పని చేశారు. మహబూబ్నగర్ తో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఓడిపోవడానికి రేవంత్ నిర్ణయాలే కారణం అని ఎండగట్టే ప్రయత్నం చేశారు.
అయితే అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత.. హై కమాండ్ తనను లైట్ తీసుకోవడం పైనే ఎక్కువగా ఆవేదనతో ఉన్నారు జీవన్ రెడ్డి. పార్టీకి కష్ట కాలంలో అండగా నిలబడితే.. తనను ఈ స్థాయిలో హై కమాండ్ పెట్టడం వెనుక రేవంత్ ఉన్నారన్నది జీవన్ రెడ్డి ఆగ్రహం. అందుకే జీవన్ రెడ్డి ఏకైక లక్ష్యం రేవంత్ ను అధికారం నుంచి దూరం చేయడం.
స్పష్టమైన ప్రభావం…
జీవన్ రెడ్డి రాజీనామాతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రెండు పార్లమెంటు స్థానాల్లో జీవన్ రెడ్డికి మంచి పట్టు ఉంది. వ్యక్తిగతంగాను మంచి పేరు ఉంది. అవినీతికి దూరంగా ఉంటారన్న గుర్తింపు కూడా ఉంది. కరీంనగర్ ఎంపీ స్థానానికి కేసీఆర్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు జీవన్ రెడ్డి.
2014లో గులాబీ పార్టీ కరీంనగర్లో ఏకపక్షంగా గెలిచింది. కానీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి గెలిచారు. అటు తరువాత ఉమ్మడి కరీంనగర్,మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి జనం వాయిస్ గట్టిగానే వినిపించారు.
అందుకే కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ డామేజ్ ఖాయం. అన్నింటికీ మించి మంచి నాయకుడు కావడంతో ఆయన మాటలను ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కంటే రేవంత్ టార్గెట్ చేస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
