పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రమవుతుండటంతో ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 115 డాలర్లను దాటడంతో, ఆ భారం నేరుగా వినియోగదారులపై పడే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ ప్రభావంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు స్పీడ్, పవర్ వంటి ప్రీమియం పెట్రోల్ రకాలపై లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకు ధరలను పెంచినట్లు ప్రకటించాయి. ఈ సవరించిన ధరలు 2026 మార్చి 20 నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రాంతాన్ని బట్టి ధరలు మారే అవకాశం ఉన్నప్పటికీ, ఈ పెంపు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. అయితే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచడం కొంతమేర వాహనదారులకు ఊరటనిస్తోంది.
తాజా పెంపుతో ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.111.68 నుంచి రూ.113.77కు చేరింది. అదే సమయంలో స్పీడ్ పెట్రోల్ ధర రూ.112.92 వరకు పెరిగినట్లు సమాచారం. సాధారణ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.103.81గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.90.35 వద్ద కొనసాగుతోంది. డీలర్ కమీషన్, ప్రాంతీయ పన్నుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్ రకాల మధ్య తేడా ప్రధానంగా ఆక్టేన్ విలువ ఆధారంగా ఉంటుంది. భారత్‌లో సాధారణ పెట్రోల్ ఆక్టేన్ విలువ 87 కాగా, ప్రీమియం పెట్రోల్ ఆక్టేన్ విలువ 91గా ఉంటుంది. అధిక ఆక్టేన్ విలువ ఉన్న ఇంధనం ఇంజిన్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అధిక శక్తి కలిగిన స్పోర్ట్స్ వాహనాలు, ఆధునిక కార్లు, శక్తివంతమైన బైకులకు ఈ ప్రీమియం ఇంధనం అనుకూలంగా ఉంటుంది. ఇది ఇంజిన్‌లో ఇంధన వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను కూడా తగ్గించడంలో తోడ్పడుతుంది.
ప్రస్తుతం ప్రీమియం పెట్రోల్ ధరలు పెరగడం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపైనా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమైతే ఇంధన ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ALSO READ: RRB ఏఎల్పీ ఆన్సర్ కీ విడుదల!
