ఏప్రిల్ చివరి వరకు మూడు విడతల్లో సాయం
రైతుల్లో హర్షం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టత వచ్చింది. సుదీర్ఘ చర్చల అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 22న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. మొత్తం కోటి 50 లక్షల ఎకరాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయడానికి రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇది నిజంగా తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
కొత్త దరఖాస్తులకు సైతం…
కేవలం రైతు భరోసా మాత్రమే కాదు మరో తీపికబురు చెప్పింది రేవంత్ సర్కార్. ఇప్పటివరకు పంట పెట్టుబడి సాయం అందని రైతులు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్తగా భూమి పట్టా పొందిన వారికి ప్రభుత్వం ఈ ఛాన్స్ ఇచ్చింది. 2026 ఫిబ్రవరి 28 లోపు పట్టా పొందిన రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలతోపాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారం లో పూర్తి వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు.
సీఎం రేవంత్ చేతుల మీదుగా…
ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో 70 లక్షల మంది రైతులకు సంబంధించి.. ఎకరంలోపు ఉన్నవారికి 3,590 కోట్లు బదిలీ చేయనున్నారు సీఎం రేవంత్. 20 రోజులకు రెండో విడతలు మరో 2650 కోట్లు జమ చేస్తారు. ఏప్రిల్ చివర్లో మిగిలిన రైతులకు మూడో విడత సాయం చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కోసారి 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతూ ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
