ఢిల్లీ, క్రైమ్ మిర్రర్:ప్రపంచ దేశాలపై అమెరికా దూకుడు ప్రవర్తిస్తూనే ఉంది. టారీఫ్‌లు పెంచుతూ మాట వినని దేశాలపై సైనిక చర్య చేపడుతూ ఆ దేశాల అధ్యక్షులను సైతం అంతమొందిస్తూ శాంతి మంత్రం జపిస్తుంది. అమెరికాకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నారనే నెపంతో వెనుజులావెలా అధ్యక్షుడిని రాత్రికి రాత్రే తీసుకెళ్లారు. తాజా ఇరాన్ చమురు పై కన్నేసిన అమెరికా ఇజ్రాయెలతో కలిసి బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఈ వ్యవహారం కొలిక్కి రాకముందే ట్రంప్ క్యూబాపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. క్యూబా నెక్ట్స్ టార్గెట్ అని దానిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉందని అన్నారు.
క్యూబాను ఆధీనంలోకి తెచ్చుకునే గౌరవం నాకే దక్కవచ్చు’ అని ట్రంప్ తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు అర్థం ఏమిటని విలేకరులు ప్రశ్నించారు. ‘అంటే.. క్యూబాకు నేను స్వేచ్ఛ కల్పించగలను. లేదంటే నా ఆధీనంలోకి తీసుకోగలను. ఆ మాటకొస్తే నేను ఏదైనా చేయగలను’ అని చెప్పుకొచ్చారు. కాగా అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో ప్రజలు కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలల్లో సముద్రమార్గం మీదుగా తమకు ఎలాంటి ఇంధన సరఫరా జరగలేదని క్యూబా ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. అమెరికా ప్రభుత్వ ఆంక్షలే ఇందుకు కారణమని తెలిపింది.
క్యూబాపై పట్టు కోసం అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అక్కడ 67 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి చెక్ పెట్టాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాక ట్రంప్ ప్రభుత్వం క్యూబాపై దృష్టి పెట్టింది. క్యూబాలోకి ముడి చమురు నౌకలు రాకుండా ఆంక్షలు విధించింది. క్యూబా నుంచి అసాధారణ ముప్పు పొంచి ఉన్నందుకే తాము ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో క్యూబా అమెరికాతో డీల్‌కు సిద్ధంగా ఉందని ఆ తరువాత మరో సందర్భంలో అన్నారు. ఇరాన్ తరువాత క్యూబాపై దృష్టి పెడతామని ఇటీవల చెప్పారు.
