Friday, March 13, 2026
Homeఆంధ్ర ప్రదేశ్Where Is Sajjala: కొత్త టీంతో జగన్.. సజ్జల ఎక్కడ? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

Where Is Sajjala: కొత్త టీంతో జగన్.. సజ్జల ఎక్కడ? రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో నెంబర్ 2లు గా అనేకమంది ఉండేవారు. ప్రస్తుతం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో కీ రోల్ మాత్రం సజ్జలదే. పార్టీ విధానాలపై ఆయనే మాట్లాడేవారు. ప్రభుత్వ నిర్ణయాలను ఆయనే చెప్పేవారు. అయితే మొన్నటి ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం ఎదురయ్యేసరికి ఆయనపైనే ఆరోపణలు వచ్చాయి. ఆయన తీరుతోనే పార్టీ ఓడిపోయిందని సీనియర్లు వ్యాఖ్యానించేదాకా పరిస్థితి వచ్చింది. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వొద్దని కూడా అధినేతకు సూచనలు వెళ్లాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇటీవల సజ్జల పార్టీ కార్యక్రమాల్లో కనిపించకపోవడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఈరోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించలేదు. దీంతో ఆయనను జగన్మోహన్ రెడ్డి సైడ్ చేసినట్లు వార్తలు ప్రారంభం అయ్యాయి.

అనూహ్యంగా జగన్ చెంతకు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో ఎంతోమంది నేతలు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. అటువంటి నేతలు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో సజ్జల పెత్తనం పెరిగింది. ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జలను తెచ్చి ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పగించారు. సలహాదారుడిగా నియమించారు. పార్టీలో సైతం కీలక పదవి కట్టబెట్టారు. అలా ఐదు సంవత్సరాలు ద్విపాత్రాభినయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తరువాత ఎవరు అంటే సజ్జల అన్నట్టు పరిస్థితి తీసుకొచ్చారు. పార్టీలో కీలక విభాగంగా ఉన్న సోషల్ మీడియా బాధ్యతలను తన కుమారుడు భార్గవ రెడ్డికి ఇప్పించుకున్నారు.

సీనియర్లలో మనస్థాపం..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు మింగుడు పడని విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఐదేళ్లపాటు తన హవాను చాటారు. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్ని తానై వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి.. జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు ఏదైనా చెప్పుకోవాలంటే మధ్య గోడల మారిపోయారు సజ్జల. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని సజ్జల ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లు సైతం ఫిర్యాదులు చేశారు. ఈ తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెడతారని కూడా ప్రచారం నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అయితే ఇది సీనియర్లకు ఎంత మాత్రం మింగుడు పడని అంశం.

ఆ కారణంతోనే..

అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు కట్టబెడితే కొంతమంది సీనియర్లు బయటకు వెళ్లిపోతామని హెచ్చరించారట. దీంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అస్సలు కనిపించలేదు సజ్జల. దీంతో జగన్మోహన్ రెడ్డి కొత్త టీం తో రెడీ కాబోతున్నారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ప్రారంభం అయింది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments