మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. సాధారణంగా చాలా మంది మాంసాహారం, మద్యపానం లేదా అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య వస్తుందని భావిస్తారు. అయితే నిజానికి పరిస్థితి అంత సులభంగా ఉండదు. చాలా మంది ఆహార నియమాలు కచ్చితంగా పాటిస్తున్నప్పటికీ, తక్కువ ప్యూరిన్ ఉన్న ఆహారం తీసుకుంటున్నప్పటికీ యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గకపోవడం కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి, దాని తొలగింపు మధ్య సమతుల్యత తప్పిపోయినప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్ అనే రసాయన సమ్మేళనాలు శరీరంలో విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనే వ్యర్థ పదార్థం తయారవుతుంది. ఈ యూరిక్ యాసిడ్ సాధారణంగా రక్తంలోకి చేరి తరువాత మూత్రపిండాల ద్వారా వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో ఈ ప్రక్రియ సరిగా జరగకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పేరుకుపోతుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
శరీరంలో నీటి కొరత కూడా యూరిక్ యాసిడ్ పెరగడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీర కణాల్లో సహజంగానే ప్యూరిన్ పదార్థాలు ఉంటాయి. ఇవి విచ్ఛిన్నం అయినప్పుడు ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్‌ను మూత్రపిండాలు వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపాలి. కానీ శరీరానికి తగినంత నీరు అందకపోతే ఈ ప్రక్రియ సరిగా సాగదు. ముఖ్యంగా వేసవి కాలంలో, ఎక్కువగా ప్రయాణాలు చేసినప్పుడు లేదా రోజూ తగినంత నీరు తాగని వారిలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం సాధారణంగా కనిపిస్తుంది. శరీరంలో ద్రవాలు తక్కువగా ఉన్నప్పుడు మూత్రపిండాలు వ్యర్థాలను సమర్థంగా తొలగించలేవు. దీంతో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరుగుతాయి.
శరీర కణాల సహజ వినిమయం కూడా ఈ సమస్యకు కారణమవుతుంది. మన శరీరం ప్రతిరోజూ పాత కణాలను విచ్ఛిన్నం చేసి కొత్త కణాలను తయారు చేస్తుంది. ఈ ప్రక్రియలో కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని పరిస్థితుల్లో కణాల విచ్ఛిన్నం ఎక్కువగా జరిగితే యూరిక్ యాసిడ్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, శరీరంలో వాపు, గాయాలు లేదా తీవ్రమైన శారీరక ఒత్తిడి వంటి పరిస్థితులు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అందుకే కొందరికి అనారోగ్యం వచ్చిన తర్వాత లేదా తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత అకస్మాత్తుగా యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగినట్లు పరీక్షల్లో కనిపిస్తుంది.
కొన్ని మందుల వినియోగం కూడా ఈ సమస్యను పెంచుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగించే కొన్ని మందులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో వాడే కొన్ని ఔషధాలు మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపవచ్చు. ఈ కారణంగా యూరిక్ యాసిడ్ వడపోత ప్రక్రియలో అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి కీళ్లలో వాపు మరియు నొప్పికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతాయి.
మూత్రపిండాల ఆరోగ్యం కూడా ఈ సమస్యలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్‌లో పెద్ద భాగాన్ని మూత్రపిండాలే తొలగిస్తాయి. అవి సరిగా పనిచేయకపోతే ఈ వ్యర్థ పదార్థం రక్తంలోనే పేరుకుపోతుంది. మూత్రపిండాల పనితీరు కొంచెం మందగించినా కూడా యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మూత్రపిండాల పనితీరును పరిశీలించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అకస్మాత్తుగా జీవనశైలిలో వచ్చే ఒత్తిడి కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. తీవ్రంగా వ్యాయామం చేయడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండడం లేదా శరీరం తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కొనడం వంటి పరిస్థితులు శరీరంలోని జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితుల్లో ప్యూరిన్ విచ్ఛిన్నం వేగంగా జరిగి యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారులు, ఆకస్మికంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశముంది.
కొంతమందిలో జన్యు లక్షణాలు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిల పెరుగుదలకు కారణమవుతాయి. కుటుంబంలోనే ఈ సమస్య ఉండటం వల్ల శరీరం సహజంగానే ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు ఈ పదార్థాన్ని సమర్థంగా తొలగించలేకపోవచ్చు. ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయి.
ఈ సమస్యను నియంత్రించడానికి ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేయడం అవసరం. శరీరానికి తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఆకస్మికంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించకపోవడం వంటి అలవాట్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే అధిక శారీరక ఒత్తిడిని తగ్గించడం, సమయానికి ఆహారం తీసుకోవడం మరియు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా అవసరం. ఈ విధంగా సరైన జీవనశైలిని పాటిస్తే యూరిక్ యాసిడ్ సమస్యను చాలా వరకు నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: NASA satellite: నాసా శాటిలైట్ మనపై పడుతుందా ఏంటి?
