* ఆయన ప్లేస్ లోకి చెవిరెడ్డి
* గట్టిగానే ప్రయత్నాలు
* తాడేపల్లి ప్యాలెస్ లో మారుతున్న పరిణామాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త కుమ్ములాట ప్రారంభం అయిందా? తాడేపల్లి ప్యాలెస్ లో పెత్తనం కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారా? సజ్జల ప్లేస్ లో మరో నేత రానున్నారా? ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. తాడేపల్లి ప్యాలెస్ అంటేనే ఒక రకమైన అధికార కేంద్రం. అక్కడ ఆధిపత్యం ప్రదర్శించేందుకు నేతలు ప్రయత్నిస్తారు అన్నది బహిరంగ రహస్యం. గతంలో విజయసాయిరెడ్డి అన్ని తానై వ్యవహరించేవారు. అయితే ఆ ప్లేస్ లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసరికి విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు సజ్జల ప్లేస్ లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది.
స్వల్ప కాలంలో ఎదుగుదల..
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. అలా అలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోకి జొరబడ్డారు. అటు తరువాత వైసిపి అధికారంలోకి వచ్చేసరికి తాడేపల్లి ప్యాలెస్ లో చోటు దక్కించుకున్నారు. అటు తరువాత తన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను అప్పగించారు. ఎంతో నమ్మకం ప్రదర్శించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పాటు పార్టీ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అలా సజ్జల రామకృష్ణారెడ్డి ఐదేళ్లపాటు ఒక హవాను కొనసాగించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ఆయన వైఖరి కారణమన్న కామెంట్స్ ఉన్నాయి. దూరం పెట్టినట్టే పెట్టి జగన్మోహన్ రెడ్డి సజ్జలకు రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.
జగన్ ప్రాధాన్యం..
అయితే సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు వ్యతిరేకించిన జగన్ లెక్క చేయలేదు. అయితే ఇప్పుడు సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా రోజులపాటు జైల్లో ఉండి పోయారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా తాడేపల్లిలోనే గడుపుతున్నారు. ఇది ఎంత మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డికి మింగుడు పడడం లేదని ప్రచారం నడుస్తోంది.
కొత్తగా సర్వేల అస్త్రం..
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కీలక నేతగా ఎదిగారు. అయితే ఎలక్షన్లలో సర్వేల కోసం ఒక టీంను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని దగ్గర అయ్యేందుకు ఆ సర్వే టీం సేవలను వినియోగించుకుంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో జగన్ గ్రాఫ్ అమాంతం పెరిగిందని.. ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారని.. మరిన్ని సెంటిమెంట్ ఘటనలు సృష్టించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊపు తేవచ్చని.. మరిన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చెయ్యాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని.. అరెస్టులు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడిపోతాయని సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య గట్టిగానే వాదనలు జరిగినట్లు సమాచారం.
తెర వెనుక ప్రయత్నాలు..
అయితే సజ్జల ప్లేస్ లోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు తెరవెనుక జరుగుతున్నట్లు సమాచారం. సజ్జలకంటే చెవిరెడ్డి మాటలనే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా విశ్వసిస్తున్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సజ్జలపై అనేక రకాల ఫిర్యాదులు ఉండడం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజాక్షేత్రం నుంచి రావడంతో ఆయన మాటలనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే స్వల్పకాలంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల ప్లేస్ లోకి వస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
