* ఏకతాటిపైకి వైయస్సార్ ఫ్యామిలీ
* ఆయన సన్నిహిత నేతలు సైతం
* మారనున్న ఏపీ రాజకీయం
క్రైమ్ మిర్రర్, ఏపీ: వైఎస్ విజయమ్మ మనసు మార్చుకున్నారా? తిరిగి జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరనున్నారా? వచ్చే ఎన్నికల్లో ప్రచారం కూడా చేస్తారా? అందుకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ పూర్తయిందా? పొలిటికల్ వర్గాల్లో ఇది ఒక ఆసక్తికర చర్చ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా పనిచేశారు విజయమ్మ. ఆ పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. కానీ షర్మిల తో జగన్మోహన్ రెడ్డికి విభేదాలు తలెత్తడంతో.. డిఫెన్స్ లో పడిపోయారు విజయమ్మ. చివరకు కుమార్తె షర్మిల వెంట అడుగులు వేశారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో కుమారుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఐక్యతకు చిరునామా..
వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆ కుటుంబం ఐక్యంగా ఉండేది. ఆ ఇంటి మహిళగా విజయమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎప్పుడు రాజకీయ వేదికలను పంచుకున్న సందర్భాలు లేవు. ఒకటి రెండు సందర్భాల్లో రాజశేఖరరెడ్డి పక్కనే కనిపించే వారు విజయమ్మ. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత విజయమ్మ కుమారుడు జగన్మోహన్ రెడ్డి కోసం బయటకు రావాల్సి వచ్చింది. నాడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో సైతం ఆమె మాట్లాడారు. అయితే వర్కౌట్ కాకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ బాధ్యతలు తీసుకున్నారు. కుమారుడు జగన్ జైలుకు వెళ్లేసరికి కుమార్తె షర్మిల తో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
కుమార్తె వెంట అడుగులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వరకు విజయమ్మ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెన్నంటి నడిచారు. కానీ షర్మిలకు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు తలెత్తడం.. షర్మిల తన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం దొరకలేదని భావించడం.. ఆమె తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి గౌరవంగా తప్పుకున్నారు విజయమ్మ. అలా తన కుమారుడి నుంచి కుమార్తె వైపు వెళ్లిపోయారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న వైరం ఆమెను ఏపీ వైపు నడిపించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం గట్టిగానే పరితపించారు షర్మిల. అయితే 2024 ఎన్నికల్లో కుమార్తె షర్మిలకు అండగా నిలవాలని ప్రత్యేక వీడియో విడుదల చేశారు విజయమ్మ. తద్వారా జగన్మోహన్ రెడ్డికి తన ఆశీస్సులు లేవని తేల్చేశారు.
రాజకీయంగా ఎదుగుదల లేక..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే షర్మిల పంతం తీరింది కానీ ఆమె రాజకీయంగా ఎదగలేదు. ఎటువంటి పురోగతి సాధించలేదు. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర మసకబారినట్లు అయింది. అది వైయస్ కుటుంబ అభిమానులకు తీరని ఇబ్బందికరంగా మారింది. అయితే ఎలాగూ షర్మిల రాజకీయంగా బలపడలేదు. బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు పుణ్యమా అని మరింత ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సన్నిహితుల సూచనలతో విజయమ్మ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతా ఒకే వేదిక పైకి..
ఇటీవల రాజకీయ పరిణామాలు మారాయి. మొన్నటికి మొన్న ఓ వివాహ వేడుకల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పిలిచే కెవిపి రామచంద్రరావు ను కలిశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆప్యాయంగా పలకరించారు. ఆయనతో రహస్య చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల చూస్తుంటే కుటుంబం అంతా మళ్లీ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహిత నేతలు అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల తో పాటు విజయమ్మను సైతం వారు జగన్మోహన్ రెడ్డికి దగ్గర చర్చే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే రాజశేఖర్ రెడ్డి కుటుంబమంతా ఏకతాటి పైకి రావడం చూస్తుంటే మాత్రం మున్ముందు ఏపీలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.
