Monday, March 9, 2026
Homeఆంధ్ర ప్రదేశ్YSRCP Leader Post: వైసీపీలో ఆ పదవి ఎవరికి?!

YSRCP Leader Post: వైసీపీలో ఆ పదవి ఎవరికి?!

* శాసనమండలిలో వైసీపీ పక్ష నేత పదవి కోసం విపరీతమైన పోటీ

* బొత్స అనారోగ్యానికి గురికావడంతో కొత్త నేతకు అవకాశం

* ఎంపిక జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టం

క్రైమ్ మిర్రర్, ఏపీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో విపక్ష నేత. ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా ఉంటుంది. ఇప్పుడు ఆ పదవి కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పైరవీలు ప్రారంభం అయ్యాయి. నేతల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆ పదవి కోసం పార్టీలో చాలామంది పోటీపడుతున్నట్లు టాక్ ఉంది. ఓ మహిళా నేత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇది ఎంత మాత్రం ఆ పార్టీ సీనియర్లకు మింగుడు పడడం లేదు. ఆ పదవి దక్కించుకునేందుకు వారు అన్ని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

శాసనమండలిలో బలం..

మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 చోట్ల మాత్రమే గెలిచింది. అయితే శాసనమండలి విషయానికి వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ప్రస్తుతం ఆ పార్టీకి 32 మంది ఎమ్మెల్సీల బలం ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు స్పీకర్. కానీ తగిన సంఖ్యాబలం ఉండడంతో శాసనమండలిలో మాత్రం విపక్ష నేత హోదాను దక్కించుకుంది. అయితే శాసనసభలో బలం లేకపోవడంతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను శాసనమండలిలో ఎండగట్టాలని చూసింది. అందుకే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ నిలబెట్టి గెలిపించుకుంది. తరువాత శాసనమండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా బొత్సకు ఛాన్స్ కల్పించారు జగన్మోహన్ రెడ్డి.

సీనియర్ నేతగా ఛాన్స్..

పొలిటికల్ గా బొత్స సత్యనారాయణ చాలా సీనియర్. ఎంపీగా, ఎమ్మెల్యేగా, సుదీర్ఘకాలం మంత్రిగా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి ప్రచారం జరిగింది. అటువంటి వ్యక్తిని శాసనమండలిలో వైసిపి పక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పగించడంతో గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఫలించాయి కూడా. కానీ బొత్స సత్యనారాయణ తరచూ అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. తాజాగా బ్రెయిన్ స్ట్రోక్ తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇకనుంచి ఆయనను స్ట్రెస్ నుంచి బయటపడేయాలని కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా బొత్స వ్యవహరించారని తేలిపోయింది. దీంతో ఆ పదవి కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పోటీ పెరిగిపోయింది.

చాలామంది పోటీ..

ప్రస్తుతం శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, తలసీల రఘురాం, పివిపి సూర్యనారాయణరాజు లాంటి నేతలు శాసనమండలి లో వైసీపీ పక్ష నేత పదవి కోరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా తన వాగ్దాటితో ఆకట్టుకుంటున్నారు వరుదు కళ్యాణి. ఆమెకు తప్పకుండా ఆ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. దీంతో మిగతా సీనియర్లు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు పదవి ఇస్తే తమ సంగతి ఏంటని వారు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి ప్రారంభం అయినట్లు అయింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments