* తెరపైకి కుల సమీకరణ
* కాపులకు ఇస్తారా? కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తారా?
* పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభం అయ్యింది. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ నలుగురు రాజ్యసభ సభ్యులు జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మూడు నెలలు ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆ ఖాళీల భర్తీకి ఎన్నికలు నిర్వహించనుంది. అయితే ఏపీలో కూటమి ఏకపక్షంగా ఉంది. దీంతో ఆ నాలుగు సీట్లు కూటమికి దక్కనున్నాయి. అయితే ఈసారి తొలిసారిగా జనసేనకు ఛాన్స్ ఇవ్వనున్నారు రాజ్యసభలో. ఇంతవరకు ఆ పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు రాజ్యసభ స్థానాలు ఏపీ నుంచి భర్తీ అయ్యాయి. అందులో రెండు టిడిపి, మరో రెండు పదవులు బిజెపి తీసుకుంది. దీంతో జనసేనకు రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి ఒక పదవి కేటాయించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు బిజెపి పెద్దలు అంగీకరించారు. అయితే జనసేన లో ఈ పదవి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
కాపు ముద్ర..
జనసేన కాపు సామాజిక వర్గం పార్టీగా ఒక ముద్ర ఉంది. కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల విషయంలో ప్రత్యేక ప్రస్తావన తెచ్చిన దాఖలాలు లేవు. తనకు అన్ని సామాజిక వర్గాలు ఒకటేనని ప్రతి సందర్భంలో చెబుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. కానీ కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ ను తమ వాడిగా చూసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి అదే కారణం. అందుకే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపుల కోసం తెగ ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కాపులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని వైసీపీ కాపు నేతలతో ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ పదవి జనసేనకు కేటాయిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే జనసేన ఆ పదవిని ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ కానుంది.
ప్రాతినిధ్యం ఎక్కువ..
వాస్తవానికి జనసేనలో కాపులకు ప్రాతినిధ్యం ఎక్కువ. మెజారిటీ ఎమ్మెల్యేలు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. కాపుల ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలతోపాటు విశాఖ నుంచి ఎక్కువమంది ఎమ్మెల్యేలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజ్యసభ పదవి వచ్చి ఉంటే జనసేన నుంచి నాగబాబు కు ఛాన్స్ వచ్చేది. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆ అవకాశం చిక్కలేదు. దీంతో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పారు చంద్రబాబు. అందుకు తగ్గట్టుగానే గత ఏడాది మార్చిలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
లింగమనేని రమేష్ కు ఖరారు?
అయితే తాజాగా కేటాయించిన రాజ్యసభ పదవిని కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారా? లేకుంటే కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తారా? అనేది పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన పారిశ్రామికవేత్త. ఆపై చంద్రబాబుకు సన్నిహితుడు అన్న ముద్ర ఉంది. కృష్ణ నది కరకట్టపై చంద్రబాబు నివసిస్తున్న ఇల్లు లింగమనేని రమేష్ దే. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు లింగమనేని. అందుకే ఈసారి రాజ్యసభ పదవి ఆయనకు ఇస్తారని ప్రచారం నటిస్తోంది. మరోవైపు జనసేనకు చెందిన కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పదవి ఆశిస్తున్నారు. 2024 ఎన్నికల కు ముందు జనసేనకు అనుకూలంగా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 1989 నుంచి వరుసగా నాలుగు సార్లు టిడిపి నుంచి నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు కొత్తపల్లి సుబ్బారాయుడు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టిడిపిలో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి అదే పదవి అందుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు అండగా నిలవడంతో పార్టీ నుంచి బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. అయితే మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపుతారో చూడాలి.
