Homeక్రీడలుT20 World Cup Winner: చెలరేగిన శాంసన్, బుమ్రా.. మూడోసారి టీ20 విజేతగా భారత్!

T20 World Cup Winner: చెలరేగిన శాంసన్, బుమ్రా.. మూడోసారి టీ20 విజేతగా భారత్!

  • చరిత్ర సృష్టించిన డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా

  • ఫైనల్ లో న్యూజిలాండ్ పై సునాయాస విజయం

  • రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచకప్‌ కైవసం  

డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. స్వదేశంలో సంపూర్ణ ఆధిపత్యంతో రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కొల్లగొట్టింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్‌(54) మెరుపులతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. బుమ్రా(4-15), అక్షర్ పటేల్(3-27) అదిరిపోయే బౌలింగ్‌ తో ఆకట్టుకున్నారు. మూడోసారి టీ20 కప్ ను భారత్ ముద్దాడింది.  స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ లో ఫేవరెట్‌గా అడుగుపెట్టిన భారత్‌ ఛాంపియన్‌గా అవతరించింది.

లీగ్ దశను అజేయంగా ముగించి.. సూపర్ 8 తొలి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. సంజూ శాంసన్(89) మెరుపులతో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ యాదవ్ సేన ఫైనల్లోనూ పంజా విసిరింది. 255 పరుగులతో న్యూజిలాండ్‌ను భయపెట్టిన భారత జట్టు.. బౌలింగ్‌లోనూ ఇరగదీసింది. బుమ్రా(4-15), అక్షర్ పటేల్‌() విజృంభణతో ఆరంభం నుంచి వికెట్లు కోల్పోయిన కివీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. అభిషేక్ శర్మ ఓవర్లో చివరి వికెట్‌గా వెనుదిరగగా.. టీమిండియా మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచింది.

ఆరంభంలోనే తడబడిన న్యూజిలాండ్

ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ నిర్దేశించిన రికార్డు ఛేదనలో న్యూజిలాండ్ తడబడింది. పవర్ ప్లేలో అక్షర్ పటేల్(2-18)తో ఓవర్లోనే డేంజరస్ ఫిన్ అలెన్‌(9)ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో.. సిక్సర్ బాదిన గ్లెన్ ఫిలిఫ్స్‌(5)ను క్లీన్‌బౌల్డ్ చేసి కివీస్‌కు మరో షాకిచ్చాడీ ఆల్‌రౌండర్. అంతకుముందు ఓవర్లో బుమ్రా ఫైనల్ లెగ్ దిశలో బంతిని గాల్లోకి లేపిన రచిన్ రవీంద్ర(1)ను ఇషాన్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. పవర్ ప్లేలోనే మూడు బిగ్ వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఓపెనర్ టిమ్ సీఫర్ట్(52), మార్క్ చాప్‌మన్‌(3)లు ఆదుకోవాలనుకున్నా సాధ్యపడలేదు.

అటు వరుణ్ చక్రవర్తి ఓవర్లో సీఫర్ట్‌ను ఇషాన్ బౌండరీ క్యాచ్‌తో డగౌట్ చేర్చగా.. పాండ్యా ఓవర్లో బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న చాప్‌మన్ వెనుదిరిగాడు. అంతే.. 72కే సగం వికెట్లు పడడంతో కివీస్ ఓటమి అంచున నిలిచింది. ఆ దశలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్(43), డారిల్ మిచెల్‌(17 ) పోరాటం చేశారు. జేమ్స్ నీషమ్‌(8)ను స్లో యార్కర్‌ తో బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే మ్యాట్ హెన్రీ(0)ని బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌ పై నిలిచాడు. కానీ.. ఫెర్గూసన్ సింగిల్ తీశాడు. కాసేపటికే అభిషేక్ ఓవర్లో జాకబ్ డఫ్ఫీ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో 96 పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది.

శాంసన్, అభిషేక్ దూకుడు  

ఫైనల్లో భారత టాపార్డర్ ఊచకోతకు న్యూజిలాండ్  బౌలర్లు తేలిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(52) ఫామ్ అందుకుంటూ హాఫ్ సెంచరీ చేయగా, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీతో సంజూ శాంసన్(89) చెలరేగిపోయాడు. వీరిద్దరి మెరుపులతో కుదేలైన కివీస్ బౌలర్లను ఇషాన్ కిషన్(54) తుఫాన్ ఇన్నింగ్స్‌ తో భయపెట్టాడు. జేమ్స్ నీషమ్(3-46) ఒకే ఓవర్లో మూడు వికెట్లతో కాస్త స్కోర్ తగ్గినా.. ఆఖర్లో శివం దూబే(26 నాటౌట్) మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లలో 255 పరుగులు చేసింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు