విశాఖపట్టణం,క్రైమ్ మిర్రర్: ఆప్కాస్ లో పనిచేసి మరణించిన, రిటైర్డ్ అయిన పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి. నూకరాజు, ఉరికూటి రాజు డిమాండ్ చేశారు. ఆప్కాస్ లో జీవితాంతం సేవా చేసి రిటైర్డ్ అయిన, మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ,జీవీఎంసీ పారిశుధ్య విభాగం, నీటిపారుదల, యుజిడి, వెటర్నరీ, పార్కులు వంటి విభాగాలలో పనిచేస్తున్న ఆప్కాస్ కార్మికులలో చనిపోయిన, రిటైర్ అయిన వారి స్థానంలో, వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోవాలన్నారు. వారందరికీ ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం.వరప్రసాద్,జె.ఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.