https://crimemirror.com/Hyderabadi as Trinamool MP...!
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా సేవలు
ఓపెన్ లీ ఎల్జీబీటీక్యూ’ ఎంపీగా రికార్డ్
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో మరోసారి తనదైన ముద్ర వేశారు. రాజకీయాలకు అతీతంగా, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని పార్లమెంటుకు పంపే సంప్రదాయాన్నికొనసాగిస్తూ ఈసారి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామిని బరిలోకి దింపారు. ఈ ఎంపిక భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి తెరలేపడమే కాకుండా, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ మరో మైలురాయిగా నిలవనుంది.
మేనకా గురుస్వామి కేవలం సుప్రీంకోర్టులో పేరున్న న్యాయవాది మాత్రమే కాదు, ఆమె మూలాలు తెలంగాణలో ఉన్నాయి. ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు మోహన్ గురుస్వామి కుమార్తెగా ఆమెకు మేధోపరమైన వారసత్వం అందింది. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన మేనక, ఐక్యరాజ్యసమితి న్యాయ విభాగంలోనూ సేవలందించారు.
అటు అంతర్జాతీయ వేదికలపై, ఇటు దేశ అత్యున్నత న్యాయస్థానంలో సంక్లిష్టమైన కేసులను వాదించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.మేనకా గురుస్వామి పేరు దేశవ్యాప్తంగా మారుమోగడానికి ప్రధాన కారణం ‘సెక్షన్ 377’ పై ఆమె చేసిన న్యాయపోరాటం. బ్రిటిష్ కాలం నాటి స్వలింగ సంపర్క వ్యతిరేక చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె వినిపించిన వాదనలు చారిత్రాత్మకమైనవి.
ఎల్జీబీటీక్యూ వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆమె, వ్యక్తిగతంగా కూడా ఆ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే, భారత పార్లమెంటులో అడుగుపెట్టిన తొలి ‘ఓపెన్లీ ఎల్జీబీటీక్యూ’ ఎంపీగా ఆమె రికార్డు గతంలో సాగరికా ఘోష్ వంటి జర్నలిస్టులను రాజ్యసభకు పంపిన మమత, ఇప్పుడు మేనకా గురుస్వామిని ఎంపిక చేయడం వెనుక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది
. పార్లమెంటులో చట్టాల రూపకల్పన సమయంలో రాజ్యాంగబద్ధమైన, న్యాయపరమైన లోతుపాతులు తెలిసిన వ్యక్తులు ఉండటం తృణమూల్ కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో బలాన్ని ఇస్తుంది. సామాజిక హక్కుల కోసం పోరాడే వ్యక్తిని ఎంపీగా పంపడం ద్వారా టీఎంసీ ఒక లిబరల్, ప్రోగ్రెసివ్ పార్టీగా తన ఇమేజ్ను పెంచుకోవాలని చూస్తోంది.
బెంగాల్ నుంచి ఇతర ప్రాంతాల మేధావులను ఎంపిక చేయడం ద్వారా పార్టీని కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా జాతీయ శక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక తెలుగు మహిళ పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం మనందరికీ గర్వకారణం. మార్చి 16న జరిగే ఎన్నికల తర్వాత ఆమె పార్లమెంటులో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.