ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన అనంతరం దశలవారీగా సంక్షేమ చర్యలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం తాజాగా అంగన్ వాడీ సిబ్బంది ఉంచిన డిమాండ్ల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 10 డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే అమలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలి ఉన్న ఒక్క డిమాండ్‌పై కూడా సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టేందుకు కసరత్తు కొనసాగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ అంశంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టమైన ప్రకటన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అంగన్ వాడీ సిబ్బంది సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే 3 సార్లు జీతాలు పెంచిన విషయాన్ని గుర్తుచేస్తూ, వేతన భద్రత కల్పించేందుకు తీసుకున్న చర్యలు సిబ్బందికి ఉపశమనం కలిగించాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ కాలంలో తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్ వాడీలు 40 రోజులు ధర్నా నిర్వహించినప్పటికీ తగిన స్పందన రాలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బంది ఉంచిన 10 డిమాండ్లలో 9 ను అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. మిగిలి ఉన్న డిమాండ్‌పై సమగ్రంగా పరిశీలన జరుగుతోందని, ఆర్థిక మరియు పరిపాలనా అంశాలను సమన్వయం చేసి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.
అంగన్ వాడీ వ్యవస్థ గ్రామీణ స్థాయిలో మహిళా, శిశు సంక్షేమానికి కీలక ఆధారం అని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. సిబ్బంది నిబద్ధతతో సేవలు అందిస్తుండటంతో వారికి తగిన గౌరవం, భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సంక్షేమ రంగంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అంగన్ వాడీ సిబ్బంది సమస్యల పరిష్కారం ఒక ముఖ్య అడుగుగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ALSO READ: కరాచీలో హింసాత్మక నిరసనలు.. కాల్పుల్లో 12 మంది మృతి
