Modi Knesset Speech: నాటి నుంచి నేటిదాకా.. ఇజ్రాయెల్‌కు ఎప్పటికీ అండగా భారత్‌!

0
315
PM Modi Reaffirms India’s Unwavering Support for Israel in Landmark Knesset Address
PM Modi Reaffirms India’s Unwavering Support for Israel in Landmark Knesset Address
  • రక్తం, త్యాగంతో ఏర్పడిన బంధం మనది
  • ఇజ్రాయెల్‌ గడ్డపై 4 వేల మంది భారత సైనికులు ప్రాణాలర్పించారు
  • మన రెండు దేశాలూ ఉగ్రవాద బాధితులే: ప్రధాని మోడీ

భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య బంధం రక్తం, త్యాగాలతో ఏర్పడిందని ప్రధాని మోడీ అన్నారు. భారత్‌, యూదు నాగరికతల మధ్య ప్రాచీన కాలం నుంచి మంచి సంబంధాలున్నాయని తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1918, సెప్టెంబర్‌లో ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని హైఫా వద్ద స్థానికులను కాపాడేందుకు శత్రువులతో పోరాడుతూ 4 వేల మందికిపైగా భారత సైనికులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఈ రెండు దేశాలు ఉగ్రవాద బాధితులేనని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని పునరుద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ నెస్సెట్‌లో ప్రసంగించారు.

రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే!  

ఇజ్రాయెల్‌పై 2023, అక్టోబర్‌ 7న హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడిని మోడీ ఖండించారు. అక్టోబర్‌ 7దాడిలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి భారతీయల నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారత్‌ నిలబడుతుందన్నారు. భారత్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమే అన్నారు. ముంబైలో 26/11 ఉగ్ర దాడుల్లో భారతీయులతోపాటు ఇజ్రాయెలీలు కూడా మరణించారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా శాంతికి ఉగ్రవాదంతో ముప్పే అన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. అందుకే గాజా శాంతి ప్రణాళికకు భారత్‌ మద్దతిస్తోందన్నారు.

రక్షణ సహకారం అత్యతం కీలకం

ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు రోజురోజుకు సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో నమ్మకమైన మిత్ర దేశాలైన భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య రక్షణ రహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యమని మోడీ అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారమే అతి ముఖ్యమైనదన్నారు.

మోడీ స్నేహితుడికంటే ఎక్కువ: నెతన్యాహు

భారత ప్రధాని మోడీ తనకు స్నేహితుడికంటే ఎక్కువ అని, సోదర సమానుడని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. మోడీ కంటే ముందు నెస్సెట్‌లో ప్రసంగించిన ఆయన.. మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో గొప్ప నేతల్లో ఒకరు, నా ప్రియమైన మిత్రుడు నరేంద్రమోడీకి జెరూసలేం స్వాగతం పలుకుతోందన్నారు. “నరేంద్ర  నాకు మిత్రుడు, సోదరుడు. ఇజ్రాయెల్‌- భారత్‌ సంబంధాలను బలోపేతం చేయటంలో మోడీ చాంపియన్‌. ఆయన ఇజ్రాయెల్‌కు గొప్ప స్నేహితుడు.   140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన దేశాల్లో భారత్‌ ఒకటి. ఇజ్రాయెల్‌ కూడా శక్తిమంతమైనదే. ఇస్లామిక్‌ వేర్పాటువాదానికి వ్యతిరేకంగా మన రెండు దేశాలు కలిసి ఉక్కు బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.