HomeజాతీయంSupreme Court: ఉచితాలు ఎంతకాలం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు!

Supreme Court: ఉచితాలు ఎంతకాలం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు!

  • ఉచిత పథకాలపై సుప్రీం ఆగ్రహం
  • రెవెన్యూలోటున్నా ఎలా ప్రకటిస్తున్నారంటూ మండిపాటు
  • ఉచిత పథకాలతో ఆర్థికాభివృద్ధికి దెబ్బని ఆగ్రహం

అడ్డగోలుగా ఉచిత పథకాలను పంచిపెట్టడం పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ, ఉచిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయని ప్రశ్నించింది. ఇలా పంచుకుంటూ పోతే, అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగించే విధానాలను పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని స్టాలిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్‌ బోర్డ్‌ (టీఎన్‌ఈబీ) 23 ఆర్టికల్‌లోని నిబంధనలను సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది.

రెవెన్యూ లోటు ఉన్నా ఉచితాలు ఎలా?

రెవెన్యూ లోటు అధికంగా ఉన్నప్పటికీ రాష్ట్రాలు పెద్దఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్‌ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుందని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్న నిధులను రహదారుల అభివృద్ధికి, ఆస్పత్రులకు, స్కూళ్లకు ఉపయోగించవచ్చునని సూచించింది. అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్‌ ఇవ్వడానికి బదులుగా, ఉపాధి కోసం మార్గాలు తెరిచేందుకు అన్ని రాష్ట్రాలూ కృషి చేయాలని హితవు పలికింది. సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్‌ చార్జీలు చెల్లించలేని వారికి ఉచితంగా అందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ చార్జీలు భరించగల వారికీ ఉచితంగా ఇస్తామనడం సబబేనా? అని తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాలకు పెట్టే ఖర్చును విద్యా రంగానికి మళ్లించవచ్చునని, ఆ నిధులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని సూచించింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments