హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణలో ఎండలు తీవ్రంగా కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగించారు. దీనిపై మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 2 నుంచే కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఎండలు తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావించారు.
జూన్ 14 ఆదివారం కావడంతో, జూన్ 15 నుంచి అంగన్వాడీ కేంద్రాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక రాష్ట్రంలోని పాఠశాలలకూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వేసవి సెలవులు పొడిగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా జూన్ 15 నుంచే తిరిగి తెరుచుకోనున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వాటిని జూన్ 14 వరకు పొడిగించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తోంది.