Homeజాతీయంబిగ్ బ్రేకింగ్.. ముగిసిన పొలిటికల్ సస్పెన్స్.. తమిళనాడు సీఎంగా విజయ్..!

బిగ్ బ్రేకింగ్.. ముగిసిన పొలిటికల్ సస్పెన్స్.. తమిళనాడు సీఎంగా విజయ్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన విజయ్ తనకు మద్దతిస్తున్న వివిధ పార్టీల లేఖలను అధికారికంగా అందజేశారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా అవతరించిన టీవీకేకు కాంగ్రెస్ అలాగే వామపక్షాలు తమ పూర్తిస్థాయి మద్దతును ప్రకటించాయి. వీటితో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు విజయ్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నాయి. కూటమి బలం స్పష్టంగా ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించారు.

రేపు ఉదయం 10 గంటలకు.?

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 118. తాజా ఎన్నికల ఫలితాల ప్రకారం విజయ్ నేతృత్వంలోని టీవీకే సొంతంగా 107 స్థానాలను కైవసం చేసుకుంది. కూటమిలోని కాంగ్రెస్ 5 సీపీఐ 2 సీపీఎం 2 వీసీకే 2 ఐయూఎంఎల్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. దీనితో విజయ్ నేతృత్వంలోని మొత్తం కూటమి బలం 120కి చేరుకుంది. మెజారిటీకి అవసరమైన సంఖ్య కంటే రెండు స్థానాలు అధికంగా ఉండటంతో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించారు. రేపు ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం అధికార యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.

లోక్ భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడక ముందే రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు పండుగ వాతావరణంలో మునిగిపోయాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం అద్భుతమైన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాల కాలంగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ దిగ్గజ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ ఒక సినీ నటుడు అత్యున్నత పదవిని చేపట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విజయ్ అభిమానులు చెన్నై వీధుల్లో బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. రేపటి ప్రమాణ స్వీకార వేడుకకు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలు హాజరయ్యే అవకాశం ఉంది.

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనేది రాజకీయ చరిత్రలో ఒక కొత్త ప్రయోగానికి నాంది పలకనుంది. విజయ్ తన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మద్దతు ఇచ్చిన వివిధ పార్టీల నేతలతో కలిసి సమన్వయంతో పాలన సాగించడం విజయ్‌కు పాలనాపరంగా ఒక పెద్ద సవాలుగా మారనుంది. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటూ టీవీకేకు పట్టం కట్టిన నేపథ్యంలో ఆయన సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తారని ఆశిస్తున్నారు. గవర్నర్ నుండి అధికారికంగా అనుమతి లభించడంతో రేపటి పట్టాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా చెన్నై నగరం అంతటా భారీగా పోలీసులను మోహరించారు.

ALSO READ: ‘పవర్‌పేట’ మూవీ క్రేజీ ప్రాజెక్టు…ప‌వ‌ర్‌ఫుల్ గ్రింప్స్ రిలీజ్‌…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు