పోలవరం, క్రైమ్ మిర్రర్: జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు.పులిని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు. పులిని సురక్షితంగా బంధించడం కోసం అటవీశాఖ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. థర్మల్ డ్రోన్లు, రేడియో కాలర్ల సహాయంతో పులి కదలికలను రెస్క్యూ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. నేలకోట పరిసర ప్రాంతంలో సంచరిస్తున్న పులిని హనుమాన్ బృందాలు రాత్రంతా పర్యవేక్షించినట్లు సమాచారం.
స్థానిక ప్రజల అప్రమత్తం…
పులి సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పులి.. గ్రామాల వైపు వెళ్లకుండా ఉండేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా ప్రజలను అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు పాల్గొన్నాయి. పులి సురక్షితంగా పట్టుబడే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.