ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: పశ్చిమాసియాలో ఉద్రిక్తలు ఉధృతమై పతాకా స్థాయికి చేరడంతో యావత్ ప్రపంచం కలవరానికి గురికావాల్సి వస్తుంది. ఇజ్రాయిల్ భూభాగంపై ఇరాన్ క్షిపణులతో దాడి చేయగా దానికి ఇజ్రాయిల్ ప్రతికార దాడులు సాగిస్తోంది. ఇరాన్ లోపలికి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ వైమానిక దళం .. అక్కడ భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని ఇరానియన్ ఉగ్రవాద పాలనకు చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం కొద్దిసేపటి క్రితమే విజయవంతంగా దాడులు చేసింది’ అని తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
ట్రంప్ మాటలను పక్కనబెట్టి…
ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి, ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార దాడులు చేయవద్దని సూచించినట్లు అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, అమెరికా ఒత్తిడిని, హెచ్చరికలను పక్కనబెట్టి నెతన్యాహు ప్రభుత్వం.. ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత అటు లండన్ కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. తద్వారా తమ దేశ రక్షణ విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ పరోక్షంగా తేల్చిచెప్పింది.