Homeఆంధ్ర ప్రదేశ్గురువారం మంట‌లే...50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత...!

గురువారం మంట‌లే…50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత…!

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్‌: ప్ర‌జ‌లారా జాగ్ర‌త్త‌…! గురువారం అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టవద్దు! ఎక్కడి వాళ్లు అక్కడ… తమతమ ఇళ్లలో ఉండటమే మంచిది.గురువారం రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లో పలుచోట్ల 50 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ… గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల తదితర జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 310 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. దీనిపై మంగళవారం ‘హీట్‌ వేవ్‌’ బులెటిన్‌ జారీ చేసింది.

నేటి నుంచి వ‌డ‌గాల్పులు…

కోస్తాంధ్రలో బుధవారం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీలు… నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43-44… అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది.

మరోవైపు రాయలసీమ, దక్షిణకోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ‘‘వడ గాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఆదివారం వరకు వడగాడ్పులు కొనసాగుతాయి’’ అని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. ఉదయం పది గంటల తరువాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు

తాజావార్తలు