డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ఓ పోలీసు ఉద్యోగి ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపింది. డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చెల్లిబోయిన రాంబాబు ఇంటిని దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ నెల 18న రాంబాబు తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. రెండు రోజుల తర్వాత, 20న తిరిగి ఇంటికి చేరుకున్న ఆయనకు తలుపుల తాళాలు, బీరువా పగులగొట్టి కనిపించాయి. దీంతో ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
బీరువాలో భద్రపరిచిన 28 కాసుల బంగారం, 750 గ్రాముల వెండి, రూ.3,500 నగదు కనిపించకపోవడంతో దొంగలు వాటిని అపహరించినట్లు రాంబాబు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి పరిసరాల్లోని వివరాలు, ఆధారాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
also read: జోగి రమేష్ కుటుంబానికి కోర్టులో ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
