-
ప్రభుత్వం ఏర్పాటుకు సమకూరిన మెజారిటీ
-
కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు మద్దతు
-
తెర వెనుక స్టాలిన్ మౌనసమ్మతి
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ఎట్టకేలకు తమిళనాడులో విజయ్ కు లైన్ క్లియర్ అయింది. సరికొత్త పొలిటికల్ శకం ప్రారంభం అయ్యింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రీ కళగం అధికార పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమం అయ్యింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రతిష్టంభనను తెరదించుతూ టీవీకేకు వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎం తో పాటు దళిత సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్న విసి కూడా మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించుతూ.. సుస్థిరమైన లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మద్దతు తెలిపిన పార్టీలు ప్రకటించాయి. తాజా మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటేశారు.
రెండుసార్లు గవర్నర్ ను కలవగా…
ఇప్పటివరకు రెండు సార్లు గవర్నర్ ను కలిశారు విజయ్. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో రావాలని గవర్నర్ సూచించారు. అయితే కేవలం ఐదుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే టీవీ కేకు మద్దతు తెలిపారు. దీంతో విజయ్ బలం 112 తో ఆగిపోయింది. ఈ పరిణామాల క్రమంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
తమిళనాడులో. అయితే విపక్షాలను కలుపుకెళ్లడంలో విజయ్ విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి. విజయ్ సంప్రదింపుల తీరుపై విసికె పార్టీ అధినేత తిరుమా వలవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరికి రాజకీయ వ్యూహకర్తల జోక్యంతో ఆయన సైతం మెత్తబడ్డారు. విజయ్ కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకె కూటమిలోని మిత్రపక్షాలన్నీ విజయ్ వైపు నిలబడడం విశేషం. అన్నా డీఎంకే నేతృత్వంలోని బిజెపి కూటమి అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు గాను ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు స్పష్టమౌతోంది.
మిత్రపక్షాలకు స్టాలిన్ గ్రీన్ సిగ్నల్ …
ఈ మొత్తం పరిణామం వెనుక మాజీ సీఎం స్టాలిన్ వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. విజయ్ సీఎం అయ్యేందుకు స్టాలిన్ మౌన సమ్మతం తెలిపినట్లు తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన రాజకీయ చాణుక్యం చాటినట్లు కూడా స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి ప్రమేయం లేని ప్రభుత్వం రావాలని స్టాలిన్ గట్టిగా భావించారు. అందుకు ప్రత్యామ్నాయ శక్తి కి బాటలు వేయడమే ఉత్తమమని భావించిన స్టాలిన్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటుకు పరోక్షంగా సహకరించారు. తన మిత్రపక్షాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం విజయ్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరనున్నారు. వామపక్షాలు, వీసికే, కాంగ్రెస్ పార్టీల ఐక్యతతో టీవీ కే సర్కార్ నిలబడనుంది. అయితే ఇది మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలి పోతుందా? లేదా అన్నది చూడాలి. తప్పకుండా టీవీ కే సర్కార్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమని తెలుస్తోంది.