క్రైమ్ మిర్రర్ : లైంగిక దాడి కేసులో జర్నలిస్ట్, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాంబే హైకోర్టు ఆగస్టు 6న తనకు విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్షను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది ఆదిత్య సమద్దర్ ద్వారా ఈ పిటిషన్ దాఖలైనట్లు సమాచారం. 2013లో గోవాలోని ఓ హోటల్ ఎలివేటర్‌లో తన వద్ద పనిచేస్తున్న ఓ జూనియర్ మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు తేజ్‌పాల్‌పై ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
తాజాగా ఈ కేసులో విచారణ జరిపిన బాంబే హైకోర్టు తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కూడా ఆదేశించింది. జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాందేకర్‌లతో కూడిన ధర్మాసనం అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించిన పలు సెక్షన్ల కింద ఆయనను దోషిగా తేల్చింది.
ఇదిలా ఉండగా, తేజ్‌పాల్‌కు విధించిన శిక్ష తీవ్ర నేరానికి తగినంతగా లేదని భావించిన గోవా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శిక్షను మరింత పెంచాలని ప్రభుత్వం కోరుతోంది. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను రాజకీయంగా లక్ష్యంగా మారినట్లు 62 ఏళ్ల తేజ్‌పాల్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.
also read : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఏడుగురికి గాయాలు
