భూపాలపల్లి, క్రైమ్‌మిర్రర్: సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు గురువారం ఉదయం 5.43 గంటలకు పవిత్ర సంగంలో తొలి పుష్కర స్నానం నిర్వహించారు. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు.
అలాగే భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి పుష్కర స్నానంలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు, రవాణా వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ పుణ్యకాలంలో భక్తులు సౌకర్యవంతంగా, సురక్షితంగా పుష్కర స్నానాలు నిర్వహించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు