మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ విడుదలైన తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. ‘ఉప్పెన’ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా, తొలి ఆట నుంచే సానుకూల స్పందన సొంతం చేసుకుని వసూళ్ల పరంగా కొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది.
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తొలి రోజే రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించిన మేకర్స్.. రామ్ చరణ్‌ను “బాక్సాఫీస్ ఛాంపియన్”గా అభివర్ణించారు. తొలి రోజు నుంచే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదు కావడంతో ఈ చిత్రం దీర్ఘకాల ప్రదర్శనలో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి, భారీ ఆక్యుపెన్సీ ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.
విజయనగరం జిల్లాలోని ‘కొండ కింద ఊరు’ అనే గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా గుర్తింపు లేని ఆ గ్రామ ప్రజలు ఎన్నో అవమానాలు, చిన్నచూపులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తుంటారు. అలాంటి గ్రామంలో పుట్టి పెరిగిన పెద్ది అనే యువకుడి పాత్రలో రామ్ చరణ్ కనిపించారు. సాధారణ కూలీగా జీవనం సాగించే పెద్దికి క్రికెట్ అంటే ప్రాణం. అతని ఆటతీరు చూసి చుట్టుపక్కల ప్రాంతాల జట్లు కూడా అతడిని తమ జట్టులోకి తీసుకోవడానికి పోటీ పడుతుంటాయి. అయితే అలాంటి ప్రతిభావంతుడైన యువకుడు అనుకోని పరిస్థితుల వల్ల క్రికెట్‌ను వదిలి కుస్తీ రంగంలోకి ఎందుకు అడుగుపెట్టాల్సి వచ్చింది అనే అంశం కథలో కీలకంగా నిలుస్తుంది.
పెద్ది జీవిత ప్రయాణంలో అప్పలసూరి పాత్రలో జగపతిబాబు, గౌర్నాయుడు పాత్రలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అలాగే అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, క్రీడా అంశాలు, కుటుంబ అనుబంధాలు, పోరాట స్ఫూర్తి వంటి అంశాలను దర్శకుడు బుచ్చిబాబు హృద్యంగా మేళవించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆయన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారీ తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలు, బలమైన కథ, రామ్ చరణ్ నటన కలిసి ‘పెద్ది’ని ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టే దిశగా తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ల రికార్డులను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: రేషన్ కార్డు ఉందా? ఐతే ఈ గొప్ప ఛాన్స్ మిస్ కాకండి..!