Homeఆంధ్ర ప్రదేశ్ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించిన 69 మంది అవుట్!

ఏపీఎస్‌పీడీసీఎల్‌లో భారీ అవకతవకలు.. నకిలీ ధృవపత్రాలతో ఉద్యోగాలు సాధించిన 69 మంది అవుట్!

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో సంచలనానికి దారితీసేలా భారీ నియామక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని సబ్‌ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల నియామకాలలో నకిలీ ధృవపత్రాల వ్యవహారం బయటపడటంతో సంస్థ అప్రమత్తమైంది. పొరుగు సేవల ద్వారా చేపట్టిన ఈ నియామకాలలో అర్హతలు లేకపోయినా కొందరు అభ్యర్థులు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు తేలింది.

ఈ ఘటనపై స్పందించిన సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పలు జిల్లాల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమగ్ర విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సబ్‌ స్టేషన్లలో నియామకాల ప్రక్రియను సమీక్షించారు.

విచారణలో బయటపడిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు తప్పనిసరిగా అవసరమైన ఐటీఐ ఎలక్ట్రిషియన్ అర్హత లేకపోయినా, నకిలీ ధృవపత్రాలు సమర్పించి ఉద్యోగాలు సాధించిన 69 మందిని అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 38 మంది, కర్నూలులో 16 మంది, చిత్తూరులో 4 మంది, నెల్లూరులో 4 మంది, తిరుపతిలో ముగ్గురు, అనంతపురంలో ముగ్గురు, అన్నమయ్య జిల్లాలో ఒక వ్యక్తి ఈ అక్రమంలో భాగస్వాములైనట్లు తేలింది.

ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ ఘటనతో విద్యుత్ శాఖలో నియామకాల పారదర్శకతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నియామకాల ప్రక్రియలో ఉన్న లోపాలు, పర్యవేక్షణ లోపం ఎంతవరకు ఉందన్న దానిపై కూడా చర్చ మొదలైంది. ఇక ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరగనుందా, బాధ్యులపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: ‘భరణం’పై హైకోర్టు కీలక తీర్పు.. భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే!

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు